రివ్యూ: గూఢచారి

goodachari movie telugu review
Highlights

మొదటినుండి కూడా కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అడివి శేష్. అతడిలో నటుడు మాత్రమే కాదు.. రచయిత, డైరెక్టర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. 

నటీనటులు: అడవి శేష్, శోభిత దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, మధు షాలిని, అనిష్ కురివెల్ల, సుప్రియ యార్లగడ్డ, వెన్నెల కిషోర్ తదితరులు  
కెమెరామెన్: శనీల్ డియో
స్టోరి: అడవి శేష్
స్క్రీన్ ప్లే: అడవిశేష్ , శశి కిరణ్ తిక్క, రాహుల్ పాకాల
డైలాగ్స్: అబ్బూరి రవి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
యాక్షన్ కొరియోగ్రఫీ: రాబిన్ సబ్బు, నబ స్టంట్స్, అర్జున్ శాస్త్రి
ప్రొడ్యూసర్: అభిషేక్ నమ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: శశికిరణ్ తిక్క 

మొదటినుండి కూడా కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అడివి శేష్. అతడిలో నటుడు మాత్రమే కాదు.. రచయిత, డైరెక్టర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. 2016 లో విడుదలైన 'క్షణం' సినిమాలో నటించడంతో పాటు ఆ కథను తనే రాసుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మళ్లీ మరోసారి 'గూఢచారి' అనే కథను రాసుకొని తనే హీరోగా నటించాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో అడివి శేష్ కు ఎలాంటి హిట్ దక్కిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
దేశాన్ని కాపాడడం కోసం మన ప్రభుత్వం త్రినేత్ర అనే మిషన్ ను చేపడుతుంది. సైనికులు సరిహద్దుల్లో మాత్రమే కాకుండా దేశం లోపల కూడా ఉండి ప్రజలను, ప్రభుత్వాన్ని కాపాడాలనేది దీని ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి సంబంధించిన వివరాలు ప్రత్యర్థులకు లీక్ అవ్వడంతో వెంటనే మిషన్ ను ఆపేస్తారు. త్రినేత్ర మిషన్ లో ఉన్న వ్యక్తులే ఈ వివరాలు బయటకు అందించారని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ క్రమంలో రఘువీర్ అనే ఆఫీసర్ చనిపోతాడు. అతడి కొడుకు గోపి(అడివిశేష్) చిన్నపిల్లాడు కావడంతో అతడి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని అతడి మావయ్య సత్య(ప్రకాష్ రాజ్) తన ఐడెంటిటీని మార్చేస్తాడు. గోపి పేరుని అర్జున్ గా మార్చి పెంచుతాడు. పెద్దయిన తరువాత అర్జున్ తన తండ్రిలానే దేశానికి సేవ చేయాలనుకుంటాడు. రా(ఇంటెలిజెన్స్ బ్యూరో)లో జాయిన్ కావాలనేది అతడి కల. అనుకున్నది సాధిస్తాడు కూడా.. చాలా ఏళ్ల క్రితం ఆపేసిన త్రినేత్ర మిషన్ ను మళ్లీ తిరిగి ఆరంభించాలనేది ప్రభుత్వం ప్లాన్. అందులో భాగంగానే అర్జున్ ని ఎంపిక చేస్తారు.

కానీ ఇదంతా అర్జున్ ని పెంచి పెద్ద చేసిన సత్యకు నచ్చదు. ఈ ఉద్యోగంలో తన ప్రాణాలు ఎక్కడ కోల్పోతాడోననే భయంతో దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు కానీ దానికి అర్జున్ అంగీకరించడు. దేశానికి సేవ చేయాలనే అర్జున్ తపనను అర్ధం చేసుకున్న సత్య అతడిని ప్రోత్సహిస్తాడు. ట్రైనింగ్ లో అందరికంటే ముందు నిలిచి మిషన్ త్రినేత్రలో కీలకపాత్రుడిగా మారతాడు. ఈ మిషన్ ఎలా జరగబోతుంది.. ఇందులో ఎవరెవరు ఉన్నారనే విషయాలను త్రినేత్ర టీమ్ లో ఒకరు ప్రత్యర్థులకు చేరవేస్తూనే ఉంటారు. వారు అర్జున్ ని టార్గెట్ చేస్తారు. త్రినేత్ర మిషన్ లో కీలకవ్యక్తులను చంపేసి ఆ నింద అర్జున్ పై పడేలా చేస్తారు. మరి ఈ పరిస్థితుల నుండి అర్జున్ ఎలా బయటపడ్డాడు..? తనను ఇరికించిన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నాడు..? అర్జున్ తండ్రి గురించి అతడికి తెలిసిన నిజాలు ఏంటి..? దేశాన్ని అంతం చేయాలనుకున్న ప్రత్యర్థులను ఎలా అంతం చేసాడు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! 


విశ్లేషణ: 
ఇండియన్ సినిమాల్లో జేమ్స్ బాండ్ తరహా కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. 'గూఢచారి' ఆ నేపథ్యంలో రూపొందించిన కథే.. స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్, సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సినిమా మొదలైన కొద్దిసేపటికి ఏదో సాగుతుందిలే అనుకుంటాం.. కానీ మెయిన్ ప్లాట్ లోకి డైరెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుండి కథ ఊపందుకుంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కథలో కీలక భాగంగా మారాయి. హీరో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరడం, అక్కడ ట్రైనింగ్ తీసుకునే విషయాలు రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఇటువంటి సీరియస్ కథ మధ్యలో లవ్ స్టోరీ ఏంటి..? ఈ రొమాన్స్ ఏంటని..? ఆడియన్స్ అనుకునేలోపు హీరోయిన్ అసలు ఎందుకు అతడిని ప్రేమించాల్సి వచ్చిందనే విషయాలు షాకింగ్ గా అనిపిస్తాయి. కానీ ఆ పాత్రను ఎక్కువసేపు తెరపై ఉంచకుండా ఇంటర్వెల్ సమయానికి ఎండ్ చేసేశారు. అసలు అర్జున్ ని ప్రత్యర్ధులు ఎందుకు టార్గెట్ చేశారనే విషయాలు ప్రీక్లైమాక్స్ వరకు రివీల్ చేయలేదు.

కానీ ఇంటర్వెల్ సమయానికి సినిమాలో రాసుకున్న ట్విస్ట్ హైలైట్ గా నిలిచింది. సినిమాలో చాలా ట్విస్టులు రాసుకున్నాడు అడివి శేష్. సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్లడం కథపై ఆసక్తిని పెంచుతుంది. తన తండ్రిలాగా దేశానికి సేవ చేయాలనుకునే అర్జున్ క్యారెక్టర్ తన తండ్రి నిజ స్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతాడు. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితుల్లో తన తండ్రి అర్జున్ ని వెతుక్కుంటూ రావడం మరో ట్విస్ట్. సినిమాలో ఈ ఫాదర్ క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తుంది. సినిమా టీమ్ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా ఈ ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు లీక్ చేయాలనుకోలేదో.. సినిమా చూస్తే తెలుస్తుంది. ఆడియన్స్ కి ఇదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. సినిమా ఒక ఫ్లోలో సాగిపోతుంటుంది. ఎక్కడా బోర్ అనే ఫీలింగ్ కలగదు. నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని ఆడియన్స్ కి క్రియేట్ చేయడంలో చిత్రబృందం సక్సెస్ అయింది. ఈ సినిమాకు మెయిన్ అసెట్ యాక్షన్. సింపుల్ గా ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

అడివిశేష్ రాసిన కథను తన టేకింగ్ తో శశికిరణ్ మరోస్థాయికి తీసుకెళ్లాడు. హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఈ కథ సాదాసీదాగా అనిపించినా.. తెలుగు ఆడియన్స్ ను మాత్రం థ్రిల్ కి గురిచేస్తుంది. అయితే విలన్ నేపధ్యం ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. బాండ్ కథకు సెంటిమెంట్, ఎమోషన్ జోడించడం కూడా బాగుంది. హీరో అడివి శేష్ హీరోగా చక్కటి నటన కనబరిచారు. యాక్షన్ సీన్స్ లో బాగా నటించాడు. ఎమోషన్ సీన్స్ లో ఇంకాస్త పరిణితి కనబరిచి ఉంటే బాగుండేది. హీరోయిన్ శోభిత నటిగా ఆకట్టుకున్నా, లుక్స్ పరంగా మాత్రం పెద్దగా మెప్పించదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. జగపతిబాబు కోసం రాసుకున్న ట్రాక్ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు జగపతిబాబు. సుప్రియ యార్లగడ్డ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయింది. తన సీరియస్ లుక్స్ తో మెప్పిస్తుంది. మధుశాలినికి చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కిందని చెప్పాలి.

యాక్షన్ సీన్స్ లో సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రకాష్ రాజ్, అనీష్ కురివెళ్ల వంటి తారలు తమ పరిధుల్లో బాగా నటించారు. వెన్నెల కిషోర్ పాత్రకి కామెడీతో పాటు ఓ ట్విస్ట్ కూడా పెట్టడం బాగుంది. నటీనటులు తమ పెర్ఫార్మన్స్ తో కథకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించారు. శనీల్ కెమెరా వర్క్ సినిమాకు మరో అసెట్. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఫిలింగ్ ఆడియన్స్ కి కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. టెక్నికల్ వర్క్ పరంగా దేనికి వంక పెట్టలేని విధంగా రూపొందించారు. అన్ని వర్గాల ఆడియన్స్ కు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సీరియస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఈ వారంలో విడుదలైన మూడు చిత్రాల్లో గూఢచారి తన సత్తా చాటడం ఖాయం. 

రేటింగ్: 3/5 

loader