సినిమా తీసింది మేము, విడుదల చేసుకుంది మేము. నష్టాలొచ్చినా లాభాలొచ్చినా భరించేది మేము. బయ్యర్ల ప్రమేయం లేదు కాబట్టి ఎంత వచ్చినా మేము సంతృప్తి చెందుతాము. కాబట్టి మేము చెప్పిందే సినిమా రిజల్ట్ అంటున్నారు గాడ్ ఫాదర్ నిర్మాత ఎన్ వి ప్రసాద్.
మెగా ఫ్యామిలీ భక్తుడైన ఎన్ వి ప్రసాద్ ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేస్తున్న కలెక్షన్స్ లెక్కలపై పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు . ఒక ప్రక్క మేము బ్లాక్ బస్టర్ అని డప్పుకొట్టుకుంటే మీరేంట్రా బాబు డిజాస్టర్ అంటరాని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి ఇజ్జత్ కాపాడే బాధ్యత భుజాన వేసుకున్నారు. సోమవారం నుండి గాడ్ ఫాదర్ మూవీ డల్ అయ్యింది.70 శాతానికి పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ పడిపోయాయి. ఇదే విషయాన్ని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ కేవలం రూ. 50 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అది రూ. 38.2 కోట్లుగా ఉంది. 85 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 60 శాతం రికవరీ మాత్రమే సాధించింది. సినిమా అమ్మకపోయినా చిరంజీవి చిత్రం అంటే కనీసం వంద కోట్ల విలువ కట్టాలిగా. ప్రస్తుత ట్రెండ్ రీత్యా గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదు.
ఇదే విషయాన్ని మీడియా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆచార్య మాదిరే గాడ్ ఫాదర్ కూడా డిజాస్టర్ అనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఆచార్య, గాడ్ ఫాదర్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న ఈ పరిణామాలు నచ్చని గాడ్ ఫాదర్ నిర్మాత ఎన్ వి ప్రసాద్ మసిపూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మూవీ ఎవరికీ అమ్మలేదు. సొంతగా విడుదల చేశాం. ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ , యూఎస్ లో 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసిందన్నారు.
గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేస్తున్న వాదన నిజమేనని చెప్పే ప్రయత్నం చేశారు. సొంతగా విడుదల చేస్తే లెక్కలు మారిపోతాయా. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఎంత ఎక్కువ చేసి చెప్పుకున్నా చెల్లుతుంది. అమెరికాలో తెగే ప్రతి టికెట్ కౌంట్ అవుతుంది. అక్కడ గాడ్ ఫాదర్ కి $ 1.1 మిలియన్ వసూళ్లు మాత్రమే వచ్చాయని లెక్కలు చెబుతుంటే ఆయన రెండు మిలియన్స్ అంటున్నారు. అసలు గాడ్ ఫాదర్ సొంతగా విడుదల చేయడానికి కారణం, నిర్మాతలు చెప్పిన ధరకు బయ్యర్లు ముందుకు రాలేదు.
గాడ్ ఫాదర్ కొనకపోవడం మంచిదయ్యిదని ఇప్పుడు బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంతగా గాడ్ ఫాదర్ విడుదల చేశారు కాబట్టి సినిమా బడ్జెట్, ఇతర ఖర్చులు వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే అన్నమాట. ఆ విధంగా నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాకు నష్టం ఏమీ లేదని పరోక్షంగా చెబుతున్నారు. గాడ్ ఫాదర్ అనుకున్న స్థాయిలో ఆడలేదన్నది నిజం. నిర్మాత ఆ విషయాన్ని ఒప్పుకోకుండా చిరంజీవి ఇమేజ్ కాపాడడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
