హాస్య నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది గీతా సింగ్. పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసిన గీతా సింగ్ కితకితలు చిత్రంలో పూర్తిస్థాయి పాత్రలో అలరించింది. ఆ చిత్రం విజయంలో గీతా సింగ్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సరైన అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతా సింగ్ చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొంటున్న సమస్యలని బయటపెట్టింది. 

చాలా చిత్రాల్లో మంచి పాత్రలు చేశా.. కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చేశా. ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా రాకపోయినా సమస్యే. మా లాంటి నటులకు సినిమాల్లో నటించినా నిర్మాతల నుంచి డబ్బులు రావు. చాలా చిత్రాల్లో నటించినందుకు, ఈవెంట్స్ లో పాల్గొంన్నందుకు నాకు ఇంకా డబ్బులు రావలసి ఉంది. 

నేను గట్టిగా ఎవరినీ అడగలేను. అదే వారి ధైర్యం. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇబ్బందులు పడుతోందన్న జాలి కూడా ఇక్కడ ఎవరికీ లేదు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.. చెప్పినా ప్రయోజనం ఉండదు అని గీతా సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. 

తెలిసిన నిర్మాతలని అవకాశాలు ఇమ్మని అడిగితే, త్వరలో పిలుస్తాం అంటారు కానీ ఎవ్వరూ పిలవరు. ఆడిషన్స్ పిలిస్తే వెళ్లినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న కొత్త దర్శకులు నటీనటులకు గౌరవం ఇవ్వడం లేదని గీతా సింగ్ అభిప్రాయ పడింది.