విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా శనివారం నాటికి పాతిక రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా విడుదలైన వారం, రెండు వారాలు మాత్రమే థియేటర్లో ఉంచుతున్నారు. స్టార్ హీరోల సినిమాలైతే మరో రెండు వారాలు ఎక్కువగా ఉంచుతారు. కానీ చిన్న సినిమాగా విడుదలైన గీత గోవిందం మాత్రం ఏకంగా 402 థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకోబోతుంది.

ఇప్పటికే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్ల సంఖ్య పరంగా కూడా సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 304 థియేటర్లు, ఇతర ప్రాంతాల్లో 100 థియేటర్లకు దగ్గరగా ఈ సినిమా 25 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యకాలంలో ఏ హీరోకి ఇలాంటి అరుదైన గౌరవం దక్కలేదంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు.