సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అరవింద్ ల మధ్య చర్చలు జరిగాయి.

మెగా క్యాంప్ లో ఎంతమంది హీరోలు ఉన్నా.. గీతాఆర్ట్స్ బ్యానర్ బయట హీరోలతో కూడా చేయడం మంచి పరిణామమనే చెప్పాలి. ఇప్పుడు మహేష్ బాబు కోసం ఓ కథను వెతికే పనిలో పడింది. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగాతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు మహేష్ బాబు.

ఈ సినిమాను గీతాఆర్ట్స్ నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ తీసే పనిలో ఉన్నాడు. ఈసారి బయట కథతో సినిమా చేయాలని భావిస్తున్నాడు సందీప్ వంగ. దానికి మహేష్ బాబు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

దీంతో మహేష్, సందీప్ లకు సరిపడే కథ కోసం గీతాఆర్ట్స్ లో కసరత్తులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. మహేష్ 'మహర్షి' సినిమా పూర్తి చేసిన తరువాత సుకుమార్ తో ఓ సినిమా చేయాలి. ఆ తరువాతే సందీప్ సినిమా మొదలవుతుంది.