బ్రిటన్ కి చెందిన బిగ్ బాస్ షో అక్కడ నుండి నార్త్ కి పాకింది. అక్కడ బాగా సక్సెస్ కావడంతో ఇప్పుడు సౌత్ లో ఈ షోని నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ షో రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడో సీజన్ కి రెడీ అవుతోంది. తమిళంలో మొదటి రెండు షోలను హోస్ట్ చేసిన కమల్ హాసన్ మూడో సీజన్ ని కూడా హోస్ట్ చేస్తున్నారు.

ఇటీవల ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. త్వరలోనే ఈ షో మొదలుకానుంది. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ షోలో ఓ స్వలింగ సంపర్కుడు పాల్గొనబోతున్నాడని సమాచారం.

కమల్ హాసన్ తో చర్చించి షో నిర్వాహకులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కమల్ హాసన్ కాకుండా మరెవరైనా హోస్ట్ అయితే ఈ నిర్ణయానికి ఒప్పుకునేవారు కాదేమోననే మాటలు వినిపిస్తున్నాయి. కమల్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట.

అయితే ఆ స్వలింగ సంపర్కుడు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. షోలో ఓ గే సెలబ్రిటీ ఉంటే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోవడానికే ఈ విషయాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తమతో పాటు ఓ గే హౌస్ లో ఉంటాడంటే మిగిలిన పోటీదారులు ఎలా ఫీల్ అవుతారో చూడాలి. ఈ వార్త నిజమే అయితే బిగ్ బాస్ సీజన్ 3 సంచలనంగా మారడం ఖాయం!