తమిళ టాప్ హీరో కమల్ హసన్, గౌతమిల వివాహ బంధానికి తెరపడింది. అవును.. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా గౌతమి స్పష్టంచేశారు. తమ దారులు వేరని, ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని గౌతమి ప్రకటించారు. అయితే తాను విడిపోయినా... కమల్ హాసనే తన హీరో అని గౌతమి అంటోంది. ఓ తల్లిగా తన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉన్నందునే కఠిన నిర్ణయం తప్పలేదంటోంది.
గౌతమి, కమల్ హాసన్ బంధం ఈనాటిది కాదు. 1989లో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన “అపూర్వ సహోదరులు” సినిమాలో గౌతమి కమల్ సరసన నటించింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను గౌతమి మొదటి వివాహం చేసుకుంది. అయితే ఏడాది తిరక్క ముందే ఇద్దరి మధ్య విబేధాలు రావటంతో 1999లో ఇద్దరూ విడిపోయారు. అప్పటికే కూతురుకు జన్మనిచ్చిన గౌతమి... తన కూతురు సుబ్బలక్ష్మితో విడిగా జీవనం సాగించింది. అయితే.. 2005 నుంచి తన చిరకాల మిత్రుడైన కమల్ హాసన్ తో సహజీవనం ప్రారంభించింది గౌతమి. అలా ఇద్దరూ గత పదేళ్లుగా భార్యాభర్తల్లా.. సహజీవనం సాగిస్తూ వచ్చారు. గతంలోనూ కమల్-గౌతమిల బంధానికి తెరపడిందని మీడియాలో కథనాలు వచ్చినా వాటిని ఇటు గౌతమి కానీ, అటు కమల్ కానీ ఖండించలేదు. కానీ ఇప్పుడు స్వయంగా గౌతమి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వేదికగా ట్విట్టర్లో తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై కమల్ హసన్ తో తనకు ఎలాంటి బంధం ఉండబోదని స్పష్టంచేసింది.
అయితే గత పదేళ్లుగా అన్యోన్యంగా కలిసి మెలసి ఉన్న తాము ఇప్పుడు విడిపోయినా కమల్ ఎప్పటికీ తన అభిమాన హీరో అని గౌతమి పేర్కొంది. తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఆ సమస్య ముదరక ముందే.. విడిపోతున్నామని గౌతమి ట్విట్టర్ లో స్పష్టం చేసింది. కమలహాసన్, గౌతమి గత కొన్ని సంవత్సరాలుగా అన్యోన్యతతో మెలిగినా.. గత కొంత కాలంగా కుటుంబ కలహాలు ఇద్దరి మధ్యా చిచ్చు రేపుతున్నాయి. దీంతో కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నానని గౌతమి ప్రకటించింది.
అయితే తన జీవితంలో క్లిష్టమైన సమయంలో కమల్ ఆదరించారని గౌతమి స్పష్టంచేశారు. ప్రస్థుతం ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వస్తున్నందున కలిసి ఉండటం మంచిది కాదని భావిస్తున్నట్లు, అందుకే పదమూడేళ్ల తమ అనుబంధానికి పుల్ స్టాప్ పెట్టినట్టు గౌతమి పేర్కొన్నారు. తన జీవితంలో ఇంతటి అత్యంత బాధాకరమైన నిర్ణయం ఎన్నడూ తీసుకోలేదని గౌతమి అభిప్రాయపడ్డారు. ఇద్దరి మార్గాలు వేరని తెలిసాక జీవితాంతం రాజీ పడటమో లేక ముందుకు సాగిపోవడమో చేయక తప్పదన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి తనకు కొన్ని సంవస్తరాలు పట్టిందన్నారు.
కమల్ పై ప్రేమను వ్యక్తం చేస్తూనే...సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో తమ బంధానికి తెరపడినట్లు ప్రకటించారు గౌతమి. అయితే ఎవర్నీ బెదిరించటానికో.. లేక ఎవరి దయాదాక్షిణ్యాల కోసమో ఇలా చేయట్లేదని గౌతమి తెలిపారు. ఈ నిర్ణయం తప్పని సరి పరిస్థితుల్లో తీసుకున్నానంది. తల్లిగా తన బాధ్యత నెరవేర్చాల్సి ఉందని, తన కూతురు కోసం కమల్ తో విడిపోక తప్పడం లేదని చెప్పింది గౌతమి.
కమల్ హసన్ తన అభిమాన హీరో అని అందరికీ తెలిసిందేనని, విడిపోయినా అది అలానే ఉంటుందని గౌతమి అంటోంది. కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా ఉన్నామని, అవి తన జీవితంలో విలువైన క్షణాలని గౌతమి చెప్పుకొచ్చింది. కమల్ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. తన ముఫ్పయేళ్ల జీవితం అంతా జనం మధ్యే గడిచిందని, అందుకే అందరికీ తన నిర్ణయం తెలియాలని కోరుకున్నట్లు గౌతమి చెప్పింది.
గౌతమి వర్షన్ ఇలా ఉంటే... సినీ పరిశ్రమలో మాత్రం.. దీపావళి రోజున కమల్-శృతీల ఫోటోలు రిలీజ్ అయినప్పుడే గౌతమి ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. కమల్శ నటిస్తున్న శభాష్ నాయుడు సినిమా షూటింగ్ సందర్భంగా శృతి-గౌతమిల మధ్య వాగ్వాదం జరిగిందని.. దాని వల్లే గౌతమి-కమల్ విడిపోయారని అనుకుంటున్నారు.
