అనేక వివాదాల నడుమ 'వాల్మీకి' టైటిల్‌ను ‘గడ్డలకొండ గణేష్‌’గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమాను చూసిన కొంత మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ నటన, అతడి మేనరిజమ్స్, డైలాగ్స్ చెప్పే తీరు విపరీతంగా ఆకట్టుకుందని చెబుతున్నారు.

తెలంగాణ యాసలో మాస్ డైలాగులను వరుణ్ అవలీలగా చెప్పేశాడని.. హరీష్ శంకర్ రాసిన డైలాగులు థియేటర్‌లో బాగా పేలాయని చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్, క్లైమాక్స్ ఇలా సినిమాలో ప్రతీ అంశం ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.

మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో బలమని చెబుతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళ నటుడు అధర్వా మురళి కీలక పాత్ర పోషించారు.