గత శనివారం సాయంత్రం సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌ బాబు ఇంటి దగ్గర నలుగురు ఆగంతకులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు మోహన్ బాబు ఫాం హౌజ్‌ వాచ్‌ మెన్‌పై బెదిరింపులకు దిగారు. ఈ సంఘటనపై మోహన్‌ బాబు కుటుంబం కంప్లయింట్ ఇవ్వటంతో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.


వారు మైలార్‌ దేవరపల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వారు రాఘవ్‌ బిరదర్‌ (30), గౌతమ్‌ రావు (23), కే ఆనంద్‌ (24), ఎస్ రాజు డేవిడ్‌ (22)గా గుర్తించారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటన జరిగిన రోజు వారు ఉపయోగించిన ఎస్యూవీ AP 31 AN 0004 నెంబర్‌ కలిగిన వాహనాన్ని సీజ్‌ చేశారు.

ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మోహన్‌ బాబు ఫాం హౌజ్‌ లోపలి నుంచి ఓ బైక్‌ బయటకు వెళ్లేందుకు వాచ్‌ మేన్‌ పెద్ద గేటు తెరిచాడు. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకువచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. వాచ్‌ మెన్‌ ఆపేందుకు ప్రయత్నించటంతో కారు దిగిన యువకులు అతని బెదిరించారు. వెంటనే అక్కడు చేరుకున్న మోహన్‌ బాబు ఆయన పెద్ద కుమార్ విష్ణు, పోలీస్‌ కంప్లయింట్ ఇచ్చారు.