2009 సంవ‌త్స‌రంలో దెందులూరి న‌ళినీ మోహ‌న్‌, ప‌ద్మా మోహ‌న్ దంపతుల‌చే దెందులూరి ఫౌండేష‌న్ స్వ‌చ్ఛంద సేవాసంస్థ‌  స్థాపించ‌బ‌డింది.  సంస్కృతి, క‌ళ‌ల ద్వారా స‌మాజ సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా గ‌త 10 సంవత్స‌రాలుగా విశేష కృషి చేస్తోంది. దివ్యాంగ క‌ళాకారుల్ని ఆద‌రించ‌డం, ఆర్థిక స‌హాయం అందించ‌డం, వృద్ధ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డం, పేద విద్యార్థుల‌కు చేయూత నివ్వ‌డంతో పాటు, నాట్య‌క‌ళ‌ను ఎంత‌గానో ప్రోత్స‌హిస్తున్నారు. 

ప్ర‌ముఖులకు అవార్డులిచ్చి స‌న్మానిస్తున్నారు. ఆంధ్ర నాట్య‌క‌ళ‌ను ప్రోత్స‌హించ‌డానికి, ప్రాచుర్యంలోకి తేవ‌డానికి కృషి చేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో 2014లో ఆంధ్ర నాట్యం మీద అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ఆధ్యాత్మ రామాయ‌ణ కీర్త‌న‌ల‌తో ఆధ్యాత్మ రామాయ‌ణం-బాల‌కాండ‌పై డాక్యుమెంట‌రీ ఫిలిమ్‌ను శ్రీమ‌తి దెందులూరి ప‌ద్మామోహ‌న్‌, వారి కుమార్తె దెందులూరి మూర్తి అఖిల జ్యోతి స్వ‌యంగా న‌ర్తించి స‌మ‌ర్పిస్తున్నారు. 

క‌ళాకృష్ణ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు నిర్మాణ నేతృత్వ సార‌ధ్యంలో మీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ డాక్య‌మెంట‌రీ రూపొందింది. దీనికి సంబంధించిన పాత్రికేయుల స‌మావేశంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి వ‌ర్యులు కామినేని శ్రీనివాస్, ప్ర‌తిపాటి పుల్లారావు, కె.రాఘ‌వేంద్ర‌రావు అతిథులుగా పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో సాహిత్య విశిష్ట కృషి పుర‌స్కారాన్ని ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అందుకున్నారు.