గత కొంత కాలంగా కరోనాతో తీవ్ర అనారోగ్యంతో ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం  బాధ ప‌డుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 12 మంది స‌భ్యులున్న ప్ర‌త్యేక డాక్టర్ల టీమ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బాలు చికిత్స పొందుతున్నారు. ప్ర‌తీ రోజూ సాయింత్రం బాలుకి సంబంధించిన హెల్త్ బులిటెన్ విధిగా విడుద‌ల చేస్తన్నారు. అంతేకాదు బాలు ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌న్నీ త‌మిళ నాడు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంది. 

ఇక తాజా అప్డేట్ విషయానికి వస్తే.... బాలు కోసం విదేశాల నుంచి డాక్టర్లు ర‌ప్పించార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం బాలు వెంటిలేట‌ర్‌పైనే ఉన్నారు. వారం రోజులుగా ఆయ‌నకు కృత్రిమ శ్వాసే అందిస్తున్నారు. ప్ర‌స్తుతం బాలు ఆరోగ్య స్థితి ప్ర‌మాద‌క‌రంగానే ఉన్నా, చేయి దాటి పోలేద‌ని చెప్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆఫీసు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు బాలు క్షేమ స‌మాచారాలు సేక‌రిస్తోంది. మ‌రోవైపు బాలు కోసం సామూహిక ప్రార్థ‌న‌లు చేయాల‌ని త‌మిళ చిత్ర‌సీమ పిలుపునిచ్చింది.

ఎస్పీబీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖ నటుడు రజనీకాంత్, కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. బాలు త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేద్దామని దర్శకుడు భారతీరాజా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత కళాకారులతో గురువారం సాయంత్రం 6 గంటలకు ఎస్పీబీ పాటల ద్వారా సామూహిక ప్రార్థనలు చేద్దామని పిలుపునిచ్చారు.