మహేష్‌ ప్రయోగాలు చేసి ఓడిపోయారు. ఆయన ప్రయోగాత్మకంగా నటించిన `వన్‌ః నేనొక్కడినే` పరాజయం చెందింది. అంతకు ముందు `నాని`తో చేసిన ప్రయోగం వికటించింది. కాస్త డిఫరెంట్‌గా చేసిన `ఖలేజా` సైతం నిరాశ పరిచింది. దీంతో మహేష్‌కి ప్రయోగాలు సెట్‌ కావనే టాక్‌ టాలీవుడ్‌లో నాటుకుపోయింది. 

ఇదిలా ఉంటే మహేష్‌ మరోసారి ప్రయోగం చేయబోతున్నాడట. అంతేకాదు ఫస్ట్ టైమ్‌ ఆయన ద్విపాత్రాభినయం చేయబోతుండటం విశేషం. ప్రస్తుతం మహేష్‌.. పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నాడు. ఇది త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించుకోనుంది. బ్యాంక్‌ స్కామ్‌ల గురించి వినోదం, సందేశం మేళవింపుగా రూపొందబోతున్న ఈ చిత్రంలో మహేష్‌ రెండు విభిన్నపాత్రల్లో మెరవనున్నారట. ప్రస్తుతం ఆ వేరియేషన్‌కి సంబంధించిన లుక్‌ టెస్ట్ జరుగుతుందట.

ఇదే నిజమైతే మహేష్‌ హీరోగా మారిన తర్వాత డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్న తొలి చిత్రమిదే అవుతుంది. అయితే బాల నటుడిగా ఉన్నప్పుడు తండ్రిసూపర్‌ కృష్ణ హీరోగా రూపొందిన `కొడుకు దిద్దినకాపురం`లో మహేష్‌ ద్విపాత్రాభినయం చేశాడు. హీరోగా మారిన తర్వాత ఎప్పుడు డ్యూయెల్‌ రోల్‌ చేయలేదు. దీంతో మహేష్‌ అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు. ఒక్క మహేష్‌ తెరపై కనిపిస్తేనే ఊగిపోయే అభిమానులు ఒకేసారి ఇద్దరి మహేష్‌లను చూస్తే.. ఇక వారి ఆనందానికి అవదుల్లేవనే చెప్పాలి. 

ఇదిలా ఉంటే మహేష్‌ లుక్‌ పరంగా పెద్దగా మార్పులుండవు. ఏ సినిమాలో చూసినా ఒకేలా ఉంటాడు. డ్రెస్‌ ఛేంజ్‌ తప్పితే, ఆయనలో ఛేంజ్‌ ఉండదనే కామెంట్‌ వినిపిస్తుంది. ఒకవేళ ద్విపాత్రాభినయం చేస్తే ఆ వేరియేషన్‌ చూపిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి మహేష్‌ ఎలా మెప్పిస్తాడో చూడాలి.