ఇది బయోపిక్ ల సీజన్.  ఏ భాషలో చూసినా  బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ నటులు, క్రీడాకారుల జీవితగాధల ఆధారంగా ఇప్పటికే కొన్ని బయోపిక్‌లు వచ్చాయి.. మరికొన్ని షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటితో పాటు తాజాగా రాజకీయ నాయకుల జీవితగాధలపై కూడా బయోపిక్‌లను రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్ బయోపిక్, వైయస్ బయోపిక్ యాత్ర,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితగాధ ఆధారంగా ‘‘తెలంగాణ దేవుడు’’ ‘‘ఉద్యమ సింహం’’ అని రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవితగాధ ఆధారంగా ‘‘చంద్రోదయం’’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు విడుదలయ్యాయి. ఇలా తెలుగులో అర డజనుకు పైగా బయోపిక్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. తమిళంలో కూడా వీటి సంఖ్య తక్కువేమీ కాదు. ఎంజీఆర్‌ బయోపిక్‌, జయలలిత బయోపిక్‌ రూపుదిద్దుకొంటున్నాయి. తాజాగా తమిళంలో  మరో సంచలనాత్మక బయోపిక్‌ నిర్మాణవుతోంది. 

‘లిబరేషన్‌ ఆఫ్‌ తమిళ ఈలం’(ఎల్‌టీటీఈ) వ్యవస్థాపకుడు వేలు పిళ్లై ప్రభాకరన్‌ జీవిత కథను తెరకెక్కిస్తున్నారు. శ్రీలంకలో తమిళుల కోసం పోరాటం చేసిన ప్రభాకరన్‌ శ్రీలంక ఆర్మీ చేతుల్లో 2009లో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన కథను సినిమాగా తీస్తున్నారు దర్శకుడు జి. వెంకటేశ్‌ కుమార్‌. సీరమ్ పులై టైటిల్ తో రూపొందే ఈ బయోపిక్ కు చెందిన ఫస్ట్ లుక్ విడుదలైంది. 

దర్శకుడు బాలూమహేంద్ర శిష్యుడైన వెంకటేశ్‌కు ఇది మూడో సినిమా. శ్రీలంక సివిల్‌ వార్‌ గురించి ఆయన రూపొందించిన తొలి చిత్రాన్ని సెన్సార్‌ బోర్డ్‌ నిషేధించింది. భారత్‌, శ్రీలంక దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అప్పట్లో సెన్సార్‌ బోర్డ్‌ ప్రకటించింది. నటుడు బాబీ సింహా ఈ బయోపిక్‌లో ప్రభాకరన్‌ పాత్ర పోషిస్తున్నారు.  ప్రభాకరన్ పుట్టిన రోజు (నవంబర్ 26న) సందర్బంగా  ఈ చిత్రం ఫస్టు లుక్ ని విడుదల చేసారు. 

తమిళనాడు, శ్రీలంక లలో ప్రభాకరన్ కు ఉన్న అభిమానులు, ఫాలోయింగ్ ని బట్టి ఖచ్చితంగా ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తుందని భావిస్తున్నారు. అలాగే వివాదాస్పద అంశాలు సినిమాలో ఉంటాయని, వాటిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే విషయమై అక్కడ మీడియా చర్చిస్తోంది. అయితే ప్రభాకరన్ బయోపిక్ తీయటమనేది కత్తిమీద సాములాంటిదే.  ఇక ప్రభాకరన్ గా నటిస్తున్న బాబీ సింగా ...తమిళ సినిమా  ‘జిగర్తండ’లో నటించి  2014లో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందారు.