పఠాన్ విజయంతో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ, ఫ్యాన్స్ సంతోషంలో ఉండగా బిగ్ షాక్ తగిలింది. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై కేసు నమోదైంది.
చాలా కాలం తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఇండియన్ బాక్సాఫీస్ పై గర్జిస్తూ పఠాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం మునుపటి చిత్రాల రికార్డులు బ్రేక్ చేస్తూ అతిపెద్ద విజయంగా దూసుకుపోతోంది. చాలా రోజుల తర్వాత మంచి మసాలా చిత్రం పడడంతో నార్త్ అభిమానులు ఎంజాయ్ చేశారు. పఠాన్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఈ విజయంతో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ, ఫ్యాన్స్ సంతోషంలో ఉండగా బిగ్ షాక్ తగిలింది. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై కేసు నమోదైంది. ఒక ప్రాపర్టీ డీల్ విషయంలో ఘరానా మోసం జరగడంతో బాధితుడు లక్నోలో గౌరీ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన జస్వంత్ షా అనే వ్యక్తి గౌరీ ఖాన్ పై కేసు నమోదు చేశారు. జస్వంత్ ఇటీవల లక్నోలో ఓ కంస్ట్రక్షన్ కంపెనీ వద్ద రూ 86 లక్షలతో ఫ్లాట్ కొనుగోలు చేశారు. డబ్బు మొత్తం చెల్లించాడు. కానీ తాను బుక్ చేసుకున్న ఫ్లాట్ ని ఆ సంస్థ మరొకరికి అప్పగించి ఘరానా మోసానికి పాల్పడ్డారని జస్వంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయా కంపెనీకి గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాను గౌరీ ఖాన్ పై నమ్మకంతోనే ఈ కంపెనీలో ఫ్లాట్ కొన్నానని పేర్కొన్నారు. దీనితో సెక్షన్ 409 నమ్మకం వమ్ము చేసే విధంగా మోసానికి పాల్పడ్డారు అని ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమెతో పాటు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తులసీయాని అనిల్ కుమార్, డైరెక్టర్ తులసీయాని మహేష్ పై కూడా కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్నారు. చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లకు ఆమె ఇంటీరియర్ డిజైన్ చేసారు. ఆ పాపులారీతో గౌరీ ఖాన్ కి ఇలా కంస్ట్రక్షన్ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంత పెద్ద చీటింగ్ కేసులో గౌరీ ఖాన్ పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ మధ్యన షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా డ్రగ్స్ కేసు నుంచి బయట పడ్డాడు.
