రోజుకురోజుకూ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ పెరుగుతుంటే థియేటర్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్స్ ధరలు విపరీతంగా పెంచి ప్రేక్షకులను థియేటర్స్ కి మరింత దూరం చేస్తున్నారు.
అనుభవమైతే కానీ తత్త్వం బోధపడన్నట్లు... తప్పుడు నిర్ణయాల తాలూకు ఫలితం అనుభవింస్తే కానీ అర్థం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా టికెట్స్ ధరలు (Ticket Prices)పెరగడంతో ప్రేక్షకుడికి వినోదం పెనుభారంగా మారింది. నలుగురు సభ్యులు కలిగిన ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే రెండు వేల రూపాయలు చాలడం లేదు. ఇక స్టార్ హీరోల చిత్రాలకైతే పెంచిన టికెట్స్ ధరలకు అదనంగా మొదటివారం రూ. 50 నుండి 100 రూపాయలు పెంచుకుని అమ్ముకునేలా అనుమతులు ఇస్తున్నారు. దీంతో మధ్యతరగతి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
కరోనా సంక్షోభంతో కుదేలైన కుటుంబాలపై నిత్యావసర ధరలు పెరుగుదల పిడుగుపాటు కాగా.. అందుబాటులో లేకుండా పోయిన టికెట్స్ ధరలు సినిమాపై ఆసక్తిని చంపేస్తున్నాయి. నెలలో రెండు సార్లు సినిమా కెళ్ళినా బడ్జెట్ కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా టికెట్స్ అధికారికంగానే రూ. 500 అమ్మారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కనీసం రూ. 250 వెచ్చిస్తే కానీ పెద్ద హీరో సినిమా చూడలేక పోతున్నాము. సెమి అర్బన్, రూరల్ ఏరియాలలో మాత్రమే రూ. 100-150 కి టికెట్ దొరుకుతుంది.
ఇది సినిమా వసూళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. సినిమా కేవలం వినోదం మాత్రమే, ఉప్పు, పప్పుకి కేటాయించిన డబ్బులతో ఎవరూ సినిమా చూడాలని అనుకోరు. ఎటూ నెలరోజుల్లో ఓటీటీలో, రెండు నెలల్లో టెలివిజన్స్ లో కొత్త చిత్రాల ప్రదర్శన ఉంటుంది. అందుకే థియేటర్ కి వెళ్లాలని ఇష్టపడేవారు కూడా లైట్ తీసుకుంటున్నారు. పెరిగిన ధరల ప్రభావం ఇటీవల విడుదలైన పెద్ద చిత్రాల విషయంలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఆచార్య మూవీని చూడడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. హిట్ టాక్ తెచ్చుకున్న ఆర్ ఆర్ ఆర్, సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata), కెజిఎఫ్ 2 చిత్రాలపై కూడా ఈ ప్రభావం కనిపించింది.
అధిక ధరల కారణంగా జరుగుతున్న నష్టాన్ని గమనించిన ఎఫ్3 (F3 Movie) మూవీ నిర్మాత దిల్ రాజు వినూత్న ప్రచారం చేస్తున్నారు. సాధారణ ధరలకే మీ అభిమాన థియేటర్స్ లో ఎఫ్ 3 మూవీ చూసి ఎంజాయ్ చేయండి అంటూ ప్రకటించారు. ప్రేక్షకుల్లో పెరిగిన ధరల కారణంగా ఏర్పడిన అసహనం, అనుమానాలు తీర్చేలా ఆయన ప్రచారం ఉంది. కాబట్టి మే 27న విడుదల కావాల్సిన ఎఫ్3 మూవీ టికెట్స్ రేట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఉంటాయి. ఏపీలో ఓ మోస్తరుగా టికెట్స్ ధరలు ఉండగా తెలంగాణాలో దారుణంగా పెంచారు. అత్యధికంగా రూ. 350 వరకు ధరలు ఉన్నాయి. కాబట్టి ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాకు ఉన్న రేట్లే అధికం, అదనంగా పెంచాల్సిన అవసరం లేదు.
