ప్రముఖ సినీ నిర్మాత ఫిరోజ్ ఏ నదియాద్వాలాకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2009-2010 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన రూ.8.56 లక్షల టాక్స్ ని ఎగ్గొట్టిన కేసులో ఫిరోజ్ కి శిక్ష పడినట్లు తెలుస్తోంది.

అయితే డిఫెన్స్ లాయర్ మాత్రం టాక్స్ కట్టడంలో జాప్యం మాత్రమే జరిగిందని.. గత మూడు సంవత్సరాలుగా ఫిరోజ్ ప్రొడక్షన్ హౌస్ లో ఎలాంటి సినిమాలు చేయడం లేదని.. ప్రస్తుతం అతడు నష్టాల్లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. 

అయితే కోర్టు మాత్రం టాక్స్ అనేది గవర్నమెంట్ కి చెందిన డబ్బని.. అది వాడుకోవడమంటే నేరానికి పాల్పడినట్లేనని తేల్చి చెప్పింది. ఫిరోజ్ తరఫు న్యాయవాది మాత్రం ఇది అబద్ధపు కేసు అని కొట్టిపారేస్తున్నారు.

గవర్నమెంట్ కి కట్టాల్సిన పన్ను ఫిరోజ్ వడ్డీతో సహా చెల్లించేశారని, రెగ్యులర్ గా టాక్స్ కట్టే తన క్లైంట్ ని కావాలనే అబద్దపు కేసు పెట్టి ఇరికిస్తున్నారని అన్నారు. ఫిరోజ్ కి వ్యతిరేకంగా నాలుగేళ్ల క్రితం ఈ కేసు నమోదైంది. ప్రస్తుతానికైతే.. ఫిరోజ్ కి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించడంతో అతడు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు.