ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించని పాక్ ప్రభుత్వం అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. పాక్ ప్రభుత్వ తీరుతో భారత ప్రభుత్వంతో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఇలాంటి సమయంలో పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న ప్రముఖ సింగర్ మికా సింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కరాచీలో షో చేసిన ఆయనపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ బ్యాన్ విధించింది.

తాజాగా మీకాసింగ్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. కరాచీలో ప్రదర్శన ఇచ్చినందుకు మీకాసింగ్ క్షమాపణలు చెప్పడంతో తాము ఆయన ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్  అసోసియేషన్ ప్రకటించింది.

పాకిస్థాన్ ప్రదర్శనపై ఆర్టికల్ 370 రద్దుకు ముందు సంతకం చేశానని.. వీసా రావడంతో తాను పాక్ వెళ్లి ప్రదర్శన ఇచ్చానని.. పొరపాటైందని.. ఇలాంటి తప్పు భవిష్యత్ లో చేయనని మీకాసింగ్ క్షమాపణలు చెప్పడంతో అతడిపై నిషేధాన్ని తొలగించారు.