బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డెత్‌ కేసులోని మలుపులు ప్రజలనే కాదు పోలీసులనే తికమక పెడుతుంది. గంట గంటకు కొత్త కోణాలు బయటపడుతూ షాక్‌కి గురి చేస్తున్నాయి. ఓ వైపు ఆయనది ఆత్మహత్యనా? హత్యా? అనే విషయాలను తేల్చేందుకు ముంబయి పోలీసులు, బీహార్‌ పోలీసులు మల్లాగుల్లాలు పడుతున్నారు. మరోవైపు మనీ లాండరింగ్‌ కేసు మరింత కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తుంది. అదే సమయంలో అనేక కొత్త కోణాలను బయటపడుతుంది. సుశాంత్‌ మరణం వెనకాల భారీగా కుట్రలే జరిగాయని అర్థమవుతుంది. 

అందులో భాగంగా సుశాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. యాభై కోట్లు ఏమయ్యాయనేది మిస్టరీగా మారింది. గత నాలుగేళ్ళలో యాభై కోట్లు ఆయన అకౌంట్లు జమకాగా, అవన్నీ విత్‌డ్రా అయినట్టు పోలీసులు గుర్తించారు. అందులో రూ. 15కోట్లు ఆయన ప్రియురాలు రియా అజ్ఞాత వ్యక్తికి బదిలీ చేసినట్టు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో అనేక కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే స్పందించారు. సుశాంత్‌ ఆత్మహత్య కేసును ఆర్థిక కోణంలో ఎందుకు విచారణ చేయటం లేదని ముంబయి పోలీసులను ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.50కోట్లు విత్‌ డ్రా అయ్యాయని, కేవలం ఏడాది కాలంలో రూ.15కోట్ల నగదును డ్రా చేశారని తెలిపారు.

ఈ కేసుకు సంబంబంధించి, మనీ లాండరింగ్‌కు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. గత నాలుగేళ్లలో సుమారు రూ.50కోట్లు సుశాంత్‌ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ ఏడాది కాలంలో రూ.17కోట్లు జమ అయితే, అందులో రూ.15కోట్లను విత్‌డ్రా చేశారు. ఈ కేసు విచారణలో ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్‌. ఈ విషయంలో మేము మౌనంగా ఉండాలనుకోవడం లేదు. దీనికి ముంబయి పోలీసులు సమాధానం చెప్పాలన్నారు.  సుశాంత్‌ కేసు విచారణకు వెళ్లిన పట్నా సెంట్రల్‌ ఎస్పీ వినయ్‌ తివారిని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించడాన్ని ఖండించారు. సుశాంత్‌ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్‌ నివేదిక మాకు ఇవ్వాల్సింది పోయి, ఎస్పీని గృహనిర్బంధం చేయడమేంటని, ఇలాంటి సహాయ నిరాకరణ ఏ ఇతర రాష్ట్ర పోలీసులు చేయడం తాను చూడలేదన్నారు. 

సుశాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి నేరుగా రియా చక్రవర్తి ఖాతాకు నగదు బదిలీ కాలేదని, దీనిపైనా తాము విచారణ జరుపుతున్నట్లు ముంబయి పోలీసు కమిషనర్‌ పరమ్‌ బిర్‌ సింగ్‌ తెలిపారు. బీహార్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో రూ.15కోట్లు సుశాంత్‌ ఖాతా నుంచి డ్రా చేసినట్లు పేర్కొన్నారు. ఆయన ఖాతాలో రూ.18కోట్లు ఉన్నట్లు తాము గుర్తించామని కొంత నగదు డ్రా అవ్వగా, ఇంకా రూ.4.5కోట్లు ఉన్నాయన్నారు. దీనిపై విచారణ జరుగుతుందని కమిషనర్‌ తెలిపారు. 

ఇదిలా ఉంటే సుశాంత్‌ కేసు విషయంలో ముంబయి పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ సీఎంకి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుశాంత్‌ తండ్రితో బిహార్‌ డీజీపీ ఈ ఉదయం మాట్లాడారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. దీంతో మేం సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నామన్నారు.