ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తైపోతున్నాయి. కానీ ఈ రెండు నెలల్లో 'ఎఫ్ 2' తప్పే మరే సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. జనవరి మొత్తం డల్ గా సాగింది.

కనీసం ఫిబ్రవరిలో హిట్స్ వస్తాయని భావించారు. ఈ నెలలో స్ట్రెయిట్, డబ్బింగ్ మొత్తం కలుపుకొని 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. 'యాత్ర' సినిమాకు మంచి టాక్ వచ్చినా.. సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది.

ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' సినిమా కూడా ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. చిన్న సినిమాలు చాలా వచ్చాయి కానీ ఒక్కటి కూడా థియేటర్ లో ఉండలేకపోయింది. ఇక డబ్బింగ్ సినిమాలు అంజలి సిబిఐ, విచారణ, దేవ్, లవర్స్ డే ఇలా ఏడెనిమిది సినిమాలొచ్చాయి.

వీటిలో ప్రియా ప్రకాష్ 'లవర్స్ డే', కార్తి 'దేవ్' పై అంచనాలున్నప్పటికీ సినిమాలకు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది. అలా ఈ నెల మొత్తం బాక్సాఫీస్ డల్ గా సాగింది. కనీసం వచ్చే నెలలో మంచి సినిమాలు వస్తాయేమో చూడాలి!