మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ సిద్ధం అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ నటించిన చిత్రం తొలిసారి సౌత్ ఇండియాలోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుండడం విశేషం. 

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలతో చిరు, రాంచరణ్, ఇతర చిత్ర యూనిట్ బిజీగా గడుపుతున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో సినిమాపై ఫరాన్, రితేష్ తమ అభిప్రాయాలని పంచుకున్నారు. కెజిఎఫ్ తర్వాత మరో సౌత్ ఇండియన్ సినిమా సైరాని రిలీజ్ చేయడానికి కారణం ఈ చిత్ర కథే అని ఫరాన్ తెలిపాడు. 

సిపాయిల తిరుగుబాటు కంటే ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారితో పోరాడారని తెలిసి షాకయ్యాం. నిజంగా ఆయన చరిత్ర గుర్తించని వీరుడు. కథ విన్న మాకే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ప్రాంతంతో బేధం లేకుండా ఆదరిస్తారని నమ్మకం కలిగినట్లు ఫరాన్ తెలిపాడు.

ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. తమకు కూడా సైరా గురించి పూర్తిగా తెలియదని, ఈ చిత్రాన్ని ప్రారంభించే క్రమంలో అనేక విషయాలు తెలుసుకున్నట్లు చిరంజీవి తెలిపారు.