ఇండియాలో సినిమాలు, క్రికెట్ ప్రధానంగా వినోదాన్ని అందిస్తుంటాయి. తమ అభిమాన హీరోలని ఫ్యాన్స్ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. అలాగే క్రికెట్ ఇండియాలో ఒక మతంలా మారిపోయింది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా వరల్డ్ కప్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. బుధవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించి శుభారంభం చేసింది. 

ఇంగ్లాండ్ లోని సౌతాంఫ్టన్ లో జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. కొందరు అభిమానులు స్టేడియంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్ర పోస్టర్స్ చూపుతూ సందడి చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా రాఘవ లారెన్స్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన కాంచన చిత్ర పోస్టర్స్ తో కూడా కొంతమంది అభిమానులు సందడి చేశారు. 

తెలుగు సినిమాగా విడుదలై హాలీవుడ్ ప్రముఖులని సైతం బాహుబలి చిత్రం ఆకర్షించింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. అలాగే రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో కాంచన సిరీస్ దిగ్విజయంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన కాంచన 3 ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.