ఈ ఏడాదిలో 'రంగస్థలం' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంతా ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ముఖ్య పాత్ర పోషించిన 'మహానటి' సినిమా కూడా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. వీటితో పాటు తమిళంలో సామ్ నటించిన 'ఇరుంబు తిరై' విడుదలై నటిగా ఆమెకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఇది ఇలా ఉండగా.. ఓ వెబ్ సైట్ నిర్వహించిన పోల్ లో బాలీవుడ్ భామలను వెనక్కి నెట్టి సమంతా ముందంజలో నిలిచింది.

ఇంతకీ ఆ పోల్ ఏంటంటే.. ఏడాది కాలంలో తెలుగు,హిందీ సినీ పరిశ్రమలకు సంబంధించిన కొందరు నటీమణులు వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో టాలీవుడ్ నుండి సమంతా, బాలీవుడ్ నుండి అనుష్క శర్మ, సోనమ్ కపూర్, సాగరికా ఘట్గే వంటి బ్యూటీలు ఉన్నారు. వీరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఖరీదైన డిజైనర్ శారీస్ లో ఈ ముద్దుగుమ్మలు పెళ్లికూతురు గెటప్ లలో మెరిసిపోయారు.

అయితే వీరందరిలో ఎవరు బాగున్నారని పోలింగ్ నిర్వహించగా.. అందులో సమంతా దాదాపు 40 శాతం ఓట్లతో టాప్ లో నిలిచింది. సామ్ తరువాత అనుష్క శర్మకి 38 శాతం ఓట్లు దక్కాయి. ఇక సోనమ్ కు ఇరవై శాతం ఓట్లు నమోదు కాగా,  సాగరికకు రెండు శాతం ఓట్లు మాత్రం వచ్చాయి. మొత్తానికి సమంతా ఈ విషయంలో బాలీవుడ్ భామలను మించిపోయింది.