రీసెంట్ గా రిలీజైన సాహో సినిమాలో ప్రభాస్ ...ఫ్యాన్స్.. డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ తనదైన స్టయిల్ లో డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది.  అయితే అందులో ఒకరు తాను డైహార్డ్ ఫ్యాన్ అని నిరూపించుకోవాలనుకున్నట్లున్నాడు.  సెల్ టవర్ ఎక్కి అరాచకం సృష్టించాడు. నానా హంగామా చేసి మీడియాకు ఎక్కాడు.  ప్రభాస్ ను కలవాల్సిందే అంటూ భీష్మించుక్కూర్చున్నాడు.
 
వివరాల్లోకి వెళితే తెలంగాణాలో జనగామ ఈ ఘటన చోటుచేసుకుంది. యశ్వంత్‌పుర పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉన్న సెల్‌ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు.  కేవలం అండర్-వేర్ తోనే ఉన్నాడు. ప్రభాస్ వచ్చేవరకు కదిలేది లేదన్నాడు. అత్యంత ప్రమాదకరంగా సెల్‌ టవర్‌ అంచు మీద నిలబడి.. ప్రభాస్‌ వస్తేనే టవర్‌ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరించాడు.

 గుగులోతు వెంకన్నది మహబూబాబాద్‌. అతడు ప్రభాస్‌ అభిమాని అని తెలుస్తోంది. ప్రభాస్‌ అంటే ఇష్టమని, ప్రభాస్‌ను చూడాలని ఉందని సెల్‌ టవర్‌పైకి ఎక్కిన వెంకన్న డిమాండ్‌ చేసాడు. తనను చూసేందుకు, కలిసేందుకు ప్రభాస్‌ రాకపోతే సెల్‌ టవర్‌ పై నుంచి  దూకేస్తానని అతను బెదిరించాడు.  ప్రభాస్ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

చివరకు స్థానికులు.. యువకుడిని బతిమాలి కిందికి దించారు. అతను పబ్లిసిటీ కోసం ఇదంతా చేసాడా లేక మతి స్దిమితం తప్పి ప్రవర్తించాడా అనేది తెలియాల్సి ఉంది.