చిత్ర పరిశ్రమలో తాజాగా మరో విషాద ఘటన జరిగింది. టాలీవుడ్ ప్రముఖ హస్యనటుడు కడలి జయ సారధి (Kadali Jaya Saradhi) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. 

చిత్ర పరిశ్రమలో వరుస విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు చిత్రసీమకు చెందిన సీనియర్ నటీనటులు, ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తుండటం సినీ లోకాన్ని కలిచి వేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు (Gautham Raju), సినీ నిర్మాత గోరంట్ల, నటి మీనా భర్త మరణించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హస్యనటుడు కడలి జయ సారధి నేడు ఉదయం స్వర్గస్థులయ్యారు. 83 ఏండ్ల వయస్సులో ఆయన కన్నుమూశారు. గత నెల రోజులుగా కడ్నీ, లంగ్స్ ప్రాబ్లంతో హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయం 2:30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. 

కేజే సారధి మరణవార్త విన్న సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారకు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు జరపనున్నారు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు సారధి. ఈయన దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించారు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా కూడా సేవలందించారు. 

నాటకరంగానికి కూడా సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు. సారధి 1960లో నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో.. సీతారామ కళ్యాణం (1961) - నలకూబరుడు, పరమానందయ్య శిష్యుల కథ (1966) - శిష్యుడు, ఈ కాలపు పిల్లలు (1976), భక్త కన్నప్ప (1976), అత్తవారిల్లు (1977), అమరదీపం (1977), ఇంద్రధనుస్సు (1978), చిరంజీవి రాంబాబు, జగన్మోహిని (1978), మన ఊరి పాండవులు (1978), సొమ్మొకడిది సోకొకడిది (1978), కోతల రాయుడు, గంధర్వ కన్య, దశ తిరిగింది, అమ్మాయికి మొగుడు మామకు యముడు, నాయకుడు – నాయకుడు, 
మదన మంజరి, మామా అల్లుళ్ళ సవాల్, బాబులుగాడి దెబ్బ, మెరుపు దాడి, వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించారు.

అదేవిధంగా సారధి విజయవంతమైన చిత్రాలకు నిర్మాత కూడా వ్యవహరించారు. ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ,అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధినే చూశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తో ఉన్న సాన్నిహిత్యం తో గోపికృష్ణ బ్యానర్ లో నిర్మించిన చిత్రాలకు సారధి గారు సాంకేతికంగా పర్యవేక్షణ చేశారు. ఇక చిత్రపురి కాలనీ నిర్మాణంలోనూ సారధి కీలక పాత్ర పోషించారు.