గత కొన్ని రోజులుగా ఇలియానాపై సౌత్ లో నిర్మాతలు నిషేధం విధించారు అని ప్రచారం జరుగుతోంది. దీనిపై సౌత్ నిర్మాతల మండలి స్పందించినట్లు తెలుస్తోంది.
గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా బాలీవుడ్ లో గాల్లో మేడలు కట్టే ప్రయత్నం చేసింది.
బాలీవుడ్ లో ఇలియానాకి కనీస ఆదరణ దక్కలేదు. దీనితో ఇలియానా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇలియానాకి ఎలాంటి అవకాశాలు లేవు. ఆమెకంటే చాలా ముందుగా కెరీర్ ప్రారంభించిన శ్రీయ లాంటి వారు కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. పెళ్ళైన హీరోయిన్లు కూడా రాణిస్తున్నారు. కానీ ఇలియానా మాత్రం ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయింది అని అంటున్నారు. దీనికి తోడు రోజుకు ఒక రూమర్ ఇలియానాకి ఇబ్బందిగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఇలియానాపై సౌత్ లో నిర్మాతలు నిషేధం విధించారు అని ప్రచారం జరుగుతోంది.

దీనిపై సౌత్ నిర్మాతల మండలి స్పందించినట్లు తెలుస్తోంది. ఇలియానాపై ఎలాంటి నిషేధం లేదని వారు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇలియానా తమిళంలో చివరగా ఇళయదళపతి విజయ్ నన్బన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం 2012లో రిలీజయింది. ఇక తెలుగులో చివరగా అమర్ అక్బర్ ఆంటోనిలో 2018లో మెరిసింది. ఆ తర్వాత ఇలియానా ఎలాంటి సౌత్ మూవీలో నటించలేదు. బహుశా అందువల్ల ఆమెపై నిషేధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో వాస్తవం లేదు అని నిర్మాతలు తెలిపారు.
నన్బన్ చిత్ర నిర్మాత ఫిర్యాదు కారణంగా ఇలియానాపై నిషేధం విధించారనే ప్రచారం కూడా జరిగింది. నన్బన్ చిత్ర నిర్మాత, ఇలియానా మధ్య సమస్య ఏర్పడిన మాట వాస్తవమే. ఆ చిత్ర షూటింగ్ టైంలో ఇలియానా.. సెట్స్ కి చాలా ఆలస్యంగా రావడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేసిందట. దీనితో ఇలియానా ప్రవర్తన బాగాలేదని, ఆమె వల్ల తనకి నష్టం వాటిల్లిందని నన్బన్ నిర్మాత ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నిజమే అయినప్పటికీ ఇలియానాపై ఎలాంటి నిషేధం లేదు అని నిర్మాతలు తాజాగా తేల్చారు.
