బాలీవుడ్‌ సినీ ప్రముఖుల భార్యల జీవితాలపై ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందుతుంది. `ఫ్యాబులస్‌ లైవ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్` పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. అత్యంత సెలబ్రిటీ తనం పొందే ఈ బాలీవుడ్‌ ప్రముఖుల భార్యల లైఫ్‌ స్టయిల్‌ ఎలా ఉంటుందనే దానిపై ఈ వెబ్‌ సిరీస్‌ ఫోకస్‌ పెట్టింది. అయితే అందరూ ఊహించినట్టుగానే వారి జీవితం ఉండదని, అందులోనూ ఆటుపోట్లున్నాయనేది చెబుతున్నారు. 

ఇక నెట్‌ఫ్లిక్స్ లో రూపొందిన ఈ చిత్రం ప్రధానంగా సోహైల్‌ ఖాన్‌ భార్య సీమా ఖాన్‌, సంజయ్‌ కపూర్‌ భార్య మహీప్‌ కపూర్‌, చుంకీ పాండే భార్య భావన పాండే, సమీర్‌ సోని భార్య నీలమ్‌ కోఠారి జీవితాలను చూపించారు. ట్రైలర్‌లో `ప్రజలకు మా గురించి ఓ అపోహ ఉంది. మావి చాలా ఆకర్షణీయమైన జీవితాలు అని, చాలా లగ్జరీగా ఉంటుందని, కానీ అది నిజం కాదు` అని చెప్పడం, `వాస్తవానికి మేం రోల్స్ రాయిస్‌ కారులో షాపింగ్‌కి వెళ్తాము. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా?` అని ప్రశ్నించింది. అంతే తాము గత్యంతరం లేక లగ్జరీ లైఫ్‌ని పొందుతున్నామని పరోక్షంగా చెప్పారు. 

ఇదిలా ఉంటే ఈ ట్రైలర్‌లో షారూఖ్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ కూడా చేరిపోవడం విశేషం. అంతేకాదు చివర్లో షారూఖ్‌, గౌరీ జోడీగా మెరిసారు. స్టార్స్ వైవ్స్ క్లబ్‌లో చేరిపోయారు. సీమా, మహీప్‌, భావానా, నీలం గత 25ఏళ్లుగా స్నేహితులుగా ఉంటున్నారు. వీరిమధ్య బలమైన అనుబంధం ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కొంత నెగటివ్‌ కామెంట్స్ వచ్చినప్పుడికి అత్యధికంగా పాజిటివ్‌ కామెంట్స్ రావడం విశేషం. అయితే `కీపింగ్‌ అప్‌ విత్‌ ది కర్దాషియన్స్ ` సిరీస్‌ ఇన్ స్పిరేషన్‌తో తెరకెక్కించారనే కామెంట్స్ కూడా వస్తుండటం గమనార్హం.