తెలుగులో సక్సెస్ అయిన సినిమాలను ఇతర భాషలలో రీమేక్ చేస్తుంటారు. నార్త్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు గనుక ఉంటే హిందీలో కూడా రీమేక్ చేస్తుంటారు. సంక్రాంతి కానుకగా విడుదలైన సక్సెస్ అందుకున్న 'ఎఫ్ 2' సినిమాను ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ముంబైలో రోజుకి కనీసం ఇద్దరు హీరోలు ఈ సినిమా చూస్తున్నారని, హీరోలు ఫైనల్ అయిన తరువాత దర్శకుడు, మిగిలిన విషయాలు బయటకొస్తాయని అన్నారు.

ఈ సినిమాకి సంబంధించిన హక్కులన్నీ తన వద్దే ఉన్నాయని, వీలైతే హిందీలో సినిమాను నిర్మించాలని అనుకుంటున్నట్లు, కానీ నిర్మాణ భాగస్వామిగా ఉండడమే మంచిదని అన్నారు. తెలుగులో ఈ ఏడాదిలో చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు.

ఇక 'ఎఫ్ 3' సినిమా గురించి మాట్లాడుతూ.. ''అనీల్ రావిపూడి ఓ కథ చెప్పాడు. పూర్తి స్థాయిలో కథ సిద్ధంగా లేదు. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత మూడో హీరో ఎవరో తెలుస్తుంది. 2021 సంక్రాంతికి 'ఎఫ్ 3' ని తీసుకొస్తామని'' స్పష్టం చేశారు.