కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్య ప్రజలతో పాటు డాక్టర్లు, పోలీసులు, సెలబ్రిటీలు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిలో మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. అక్కడ టాప్‌ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌తో పాటు మధ్య   ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా వైరస్‌ బారిన పడ్డాడు. కన్నడ నటి, ఎంపీ సుమలత అంబరీష్ కూడా వైరష్ బారిన పడ్డారు.

మూడు వారాల క్రితం సుమలతకు వైరస్‌ లక్షణాలు కనిపించటంతో చెక్‌ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. తన నియోజిక వర్గంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా సుమలతకు వైరస్‌ సోకిందని భావిస్తున్నారు. అయితే తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారెంటైన్‌లోకి వెళ్లిన సుమలత, తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.

కొద్ది రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సుమలత, ఇటీవల మరోసారి టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. సుమలతకు నెగెటివ్ రావటంతో అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. కన్నడ నాట యంగ్ హీరో ధృవ సర్జ, ఆయన భార్యతో పాటు స్టార్ హీరో అర్జున్‌ కూతురు ఐశ్వర్య అర్జున్‌లకు కూడా కరోనా సోకింది.