Asianet News TeluguAsianet News Telugu

ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ‘సీతారామం’.. సినిమాపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు..

రీసెంట్ చిత్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘సీతారామం’. ఈ రొమాంటిక్ డ్రామాపై తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. చిత్రం చూసిన ఆయన నటీనటులను అభినందించారు. తనదైన శైలిలో రివ్యూను అందించారు. 

Everyone should watch the film sita Ramam, Former Vice President Venkaiah Naidu praises
Author
Hyderabad, First Published Aug 17, 2022, 10:25 PM IST

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - యంగ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్  జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’(Sita Ramam). ఈ నెల 5న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ నేటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అటు  బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.  ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకున్న ఈ పీరియడ్ మ్యూజికల్ రొమాంటిక్  డ్రామాపై సినీ తారలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే విధంగా ప్రముఖులూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) చిత్రంపై  స్పందించడం విశేషం. 

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికన చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా సినిమా కథ, నటీనటుల పెర్ఫామెన్స్ పైనా తనదైన శైలిలో రివ్యూ ఇస్తూ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ‘సీతారామం’ అని చెప్పుకొచ్చారు. ట్వీట్ చేస్తూ.. ‘‘సీతారామం’ చిత్రాన్ని వీక్షించాను. నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది’ అని తెలిపారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు ట్వీట్ వైరల్ అవుతోంది.

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10తో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన పదవీ గడువుకు ముందే రాజ్యసభలో వెంకయ్య నాయుడుకి సభ్యులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ చైర్మన్ గా, ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుుడు భావోద్వేగమైన ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. సభ నిర్వాహకుడిగా నిర్మాణాత్మకమైన చర్చలు జరిపేందుకు ఆయన ఎంతగానో శ్రమించిన  విషయం తెలిసిందే. వెంకయ్య తర్వాత భారత ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతలను జగదీప్ ధన్కర్ చేపట్టారు. అంతకుముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ధన్కర్ సేవలందించారు.   

 

ఇదిలా ఉంటే ‘సీతా రామం’ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - యంగ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో  నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వని దత్ రూపొందించారు. 1970ల నేపథ్యంలో సాగే ప్రేమకథను దర్శకుడు హనురాఘవపూడి  చక్కగా తెరకెక్కించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుమంత్, భూమికా చావ్లా ఆయా పాత్రలను పోషించారు. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios