ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం రాజమౌళి సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ లోనే ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. రెండు నెలలు నిరవధికంగా సాగేలా షూటింగ్ ప్రణాళిక రూపొందించినట్లు రాజమౌళి చెప్పడం జరిగింది. తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విశేషాలన్నీ పంచుకున్నారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ విడుదలపై రాజమౌళి కామెంట్ మాత్రం ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు షాక్ ఇచ్చేదిగా ఉంది.  లాక్ డౌన్ ముందు వరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలపై స్పష్టత ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితుల రీత్యా విడుదల తేదీపై ఖచ్చితమైన ప్రకటన చేయలేను. దాని కారణం షూటింగ్ సమయంలోనే మాత్రమే వాస్తవంగా ఉన్న ఇబ్బందులు, అనుకూలతలు, ప్రతికూలతలు తెలుస్తాయి అని అన్నారు. 

ఒకసారి షూటింగ్ మొదలైన తరువాత మాత్రమే తనకు కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీపై క్లారిటీ రానుందని ఆయన చెప్పడం కొంచెం ఆందోళన కలిగించే అంశమే. షూటింగ్స్ నిర్వహణలో ఉన్న ఇబ్బందులు, కోవిడ్ ఆంక్షల వలన మిగిలిన ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ భాగం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో తనకే క్లారిటీ లేదని రాజమౌళి తాజా స్టేట్మెంట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. 

ఐతే ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి త్వరలోనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై ప్రకటన ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం నెలలుగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఈ వార్త తీపి గుళిక అని చెప్పాలి. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న విడుదల కావాల్సిన కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో లాక్ నేపథ్యంలో వాయిదాపడింది.