టీవీ జబర్దస్త్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా  చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 ఎపిసోడ్స్‌లలో పలు పాత్రలు పోషించారు. 


ఎవరిని ఏ సమయంలో మృత్యువు పిలుస్తుందో తెలియదు. షూటింగ్ కోసం అని బయిలుదేరి అనుకోని ప్రమాదంలో ప్రాణం పోగొట్టుకున్నారు. తన కుటుంబానికి తీరని మనోవేదన మిగిల్చారు. ఇది కొత్తగూడెంలో జరిగింది. కదులుతున్న ట్రైన్ ని ఎక్కేందుకు ప్రయత్నించటే ప్రాణం తీసేసింది. వివరాల్లోకి వెళితే...

కొత్తగూడెం రైల్వే ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మేదర మహ్మద్దీన్‌ (53) భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ (కొత్తగూడెం)కు ఉదయం వచ్చారు. అదే సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించారు. కిందకు జారిపడటంతో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. 

వెంటనే లోపలున్న ప్రయాణికులు చైన్‌లాగడంతో లోకోపైలెట్‌ రైలును ఆపారు. రైల్వే పోలీసులు సిబ్బంది సహాయంతో మహ్మద్దీన్‌ను బయటకు లాగి ‘108’లో కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. నడుము, పక్కటెముకలకు తీవ్రగాయాలైన బాధితుడికి వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో సేవలందించారు. డా.రోషిణి సూచనలతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి శవాల గదిలో భద్రపరిచారు. డ్యూటీ వైద్యురాలి ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక మహ్మద్దీన్‌ ఈటీవీ జబర్దస్త్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 ఎపిసోడ్స్‌లలో పలు పాత్రలు పోషించారు. షూటింగ్‌ ఉందని చెప్పి శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఉదయం స్టేషన్‌కు వచ్చారు. ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. మృతుడికి భార్య, డిగ్రీ, పదోతరగతి చదివే ఇద్దరు కుమార్తెలున్నారు. మహ్మద్దీన్‌ మృతితో నందాతండాలో విషాదం అలుముకుంది. కళాకారుడిగా రాణిస్తూ కుమార్తెలు చదివించుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.