సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తికి ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) షాక్‌ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా పోలీసులకు, ఈడీకి సహకరించకుండా, తమకి కనిపించకుండా రియా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఈడీ సీరియస్‌ అయ్యింది. ఆగస్ట్ 7(రేపటి)లోగా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్న బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే తెలిపిన విషయం తెలిసిందే. 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ కేసులో ఇప్పుడు రియా కీలకంగా మారింది. నిజం చెప్పాలంటే ఆమె చుట్టూతే కేసు మొత్తం తిరుగుతుంది. పక్కా ప్లాన్‌ ప్రకారం ఆమె ఇదంతా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్‌ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి, మోసం చేసిందని సుశాంత్‌ తండ్రి, సుశాంత్‌ స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెని విచారించేందుకు ముంబయి పోలీసులు, బీహార్‌ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆమె తప్పించుకుని తిరుగుతుంది. 

దీంతో ఈడీ రేపటిలోగా తమ ముందు హాజరు కావాలని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అంతేకాదు రియా సహచరుడు శామ్యూల్‌ మిరాండాని కూడా ఈడీ ప్రశ్నించింది. అతన్నికూడా హాజరు కావాలని తెలిపింది. సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ మనీలాండరింగ్‌ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రియాపై వ్యక్తిగత మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన తర్వాత ఆర్థిక దర్యాప్తు సంస్థ చార్టర్డ్ అకౌంటెంట్‌ సందీప్‌ శ్రీధర్‌ నివాసానికి చేరుకుని ప్రశ్నించింది. దీంతోపాటు రియా సీఏ రితేష్‌ షాని సైతం ముంబైలో తన కార్యాలయంలో విచారించింది. 

మనీలాండరింగ్‌ కేసులో రియాతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై ఈడీ కేసు నమోదు చేసింది. రియా ఇటీవల కాలంలో దాదాపు రూ.15కోట్లు సుశాంత్‌ అకౌంట్‌ నుంచి అజ్ఞాత వ్యక్తికి అక్రమంగా తరలించినట్టు వెల్లడైంది. దీనిపై లోతుగా విచారిస్తున్నారు.