గత రాత్రి నుండి సోషల్ మీడియాలో ఓ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ''ఏం పీకలేరు బ్రదర్'' అనే ఈ ట్యాగ్ ని మెగా ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా బన్నీ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన స్టార్ హీరోల మధ్య విబేధాలకు విజయవాడ మీటింగ్ కారణమైంది.
విజయవాడ వేదికగా రెండు రోజుల క్రితం మెగా అభిమానుల సమ్మేళనం పేరుతో ఓ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ అభిమాన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మీటింగ్ ఎజెండా ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో మెగా హీరోల అభిమానులు జనసేన విజయం కోసం పాటు పడాలి. అయితే అనధికారికంగా మరో విషయం ఈ మీటింగ్ లో చర్చకు వచ్చింది. అదే అల్లు అర్జున్ కి మద్దతు సంహరణ. మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఫ్లెక్సీలో అల్లు అర్జున్ ఫోటో వేయలేదు.
ఇది చాలదన్నట్లు సభకు హాజరైన వారిలో ఒకరు అల్లు అర్జున్(Allu Arjun) పై మాటల దాడి చేశారు. మెగా ఫ్యామిలీకి కానీ, జనసేనకు గానీ అల్లు అర్జున్ నుండి ఎలాంటి మద్దతు లభించడం లేదు. అలాగే గతంలో అతడు చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ గా అవమానించాడు. ఏరు దాటాక తెప్ప తగలేయడం అన్న తీరుగా... చిరంజీవి కారణంగా ఎదిగి ఇప్పుడు విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటి అల్లు అర్జున్ ని మనం ఇంకా భుజాలపై మోయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇకపై మెగా హీరోగా కాదని తీర్మానం చేశాడు.
ఈ సందేశానికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో రచ్చమొదలైంది. దీన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందరూ ఏకమై చరణ్, పవన్, చిరంజీవి ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ''ఏం పీకలేరు బ్రదర్'' (EmPeekalerubrother) అంటూ ఓ ట్యాగ్ తో మెగా ఫ్యాన్స్ కి సవాల్ విసురుతున్నారు. వీరికి ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ మ్యూచువల్ ఫ్యాన్స్ మద్దతుగా వచ్చారు. చిన్నగా ఈ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ అంటే మెగా అభిమానుల్లో ఈర్ష్య మొదలైంది. అందుకే అల్లు అర్జున్ ని మెగా హీరో కాదంటూ తీర్మానం చేసి, ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభిమాన సంఘ అధ్యక్షుడు బహిరంగంగా అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పాడు. ఈ విషయంలో చిరంజీవి, చరణ్ సీరియస్ అయ్యారని, అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారని వివరణ ఇచ్చాడు.
అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. అల్లు అర్జున్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ నినాదాలతో ఇబ్బంది పెడుతున్న ఫ్యాన్స్ పై ఆయన ఫైర్ అయ్యాడు. పవన్ పేరు చెప్పను బ్రదర్ అని అనడంతో వివాదం రగులుకుంది. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి కొంచెం గ్యాప్ రావడం జరిగింది. తాజాగా అభిమాన సంఘాల కారణంగా అనవసర వివాదం తలెత్తింది. ఈ వివాదంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ గొడవ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
