ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానం తారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగు జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని కీలకమైన సీన్ల్ ను చిత్రీకరించారు. అయితే అంతా బాగానే ఉన్నా‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన పరాయి దేశం పిల్లను హీరోయిన్ గా ఎంపిక చేయాలని  ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించటంలేదు.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో రామ్‌చరణ్‌ సరసన అలియాభట్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మొదట ఎన్టీఆర్‌ కోసం బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ని ఎంపిక చేసినా, ఆమె కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకొంది. అప్పట్నుంచి ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ కోసం రాజమౌళి, ఆయన టీమ్ అన్వేషిస్తోంది. చాలామంది హిందీ హీరోయిన్స్ పేర్లు వినిపించినా, తాజాగా హాలీవుడ్ చిత్రాల హీరోయిన్, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ పేరు తెరపైకి వచ్చింది. కథ రీత్యా ఆ పాత్రలో ఇంగ్లిష్‌ హీరోయిన్‌ నటించాల్సి ఉంటుందని, అందుకే రాజమౌళి.. ఎమ్మా రాబర్ట్స్‌ని సంప్రదించారని, ఇటీవల ఆయన అమెరికా వెళ్లి రావడానికి కారణం కూడా అదేనని ప్రచారం సాగుతోంది.

 అమెరికాకి చెందిన ఎమ్మా చాలా ఆంగ్ల చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవటంతో ఆమెనే ఎంపిక చేసారంటున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆమె కూడా నో చెప్పిందట. ఇండియాకు వచ్చి షూటింగ్ లో పాల్గొనాల్సి రావటం, బల్క్ డేట్స్ ఇవ్వాల్సిన అవసరం, ఇంతా చేస్తే ఇది ఓ ప్రాంతీయ చిత్రం కావటం వాళ్లను ఆలోచనలో పడేస్తున్నాయట . ఈ కారణాలతో హీరోయిన్   ఎంపిక గురించి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’టీమ్  ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. 

డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఎన్టీఆర్‌ ఇందులో కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న చిత్రాన్ని విడుదల చేస్తారు..