రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం ఈగ. ఆ  సినిమాలో విలన్ గా చేసిన సుదీప్ ని మర్చిపోవటం కష్టమే.  ఆయన కన్నడంలో స్టార్ హీరో. ఇప్పుడు సుదీప్ ఓ సస్పెన్స్ సినిమాని సమర్పిస్తున్నారు. ఆయనకు కథ నచ్చి మొత్తం పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు సస్పెన్స్‌ థ్రిలర్ల మూవీలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కన్నడ దర్శకుడు సునీల్‌ కుమార్‌ దేశాయ్‌.

సునీల్ కుమార్ దేశాయ్  దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ‘ఉద్ఘర్ష’. థాకూర్‌ అనూప్‌ సింగ్‌, సాయి ధన్సిక, తాన్య హోప్‌, కిషోర్‌, శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా  ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘అందరూ కొత్త ఏడాది సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో జరిగిన ఓ హత్య వారిని ఒక వేరొక దారిలోకి తీసుకెళ్లింది’ అంటూ బ్యాగ్రౌండ్‌ వాయిస్‌తో గంభీరంగా ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించింది. మరి ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? తెలియాలంటే ‘ఉద్ఘర్ష’ చూడాల్సిందే. సంజయ్‌ చౌదరి సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని దేవరాజ్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.