డబ్బుల కోసం నా ఇంటికి రావొద్దు... ఆదిరెడ్డి ఎందుకు హెల్ప్ చేయను అంటున్నాడు?
బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి ఓ వీడియో చేశాడు. అందులో డబ్బుల కోసం ఎవరూ నా ఇంటికి, సెలూన్ కి రావొద్దని గట్టిగా చెప్పాడు. అందుకు కారణం ఏమిటో చూద్దాం...
బిగ్ బాస్ రివ్యూవర్, మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డికి సోషల్ మీడియాలో పిచ్చ పాపులారిటీ ఉంది. బిగ్ బాస్ సీజన్ మొదలైంది అంటే ఆదిరెడ్డి రివ్యూల కోసం ఎగబడే ఫ్యాన్స్ ఉన్నారు. ఆదిరెడ్డి యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. డబ్బులు తీసుకుని కొందరు కంటెస్టెంట్స్ కి ఫేవర్ గా ఆదిరెడ్డి రివ్యూలు చెబుతున్నాడనే ప్రచారం జరిగింది.
దానికి ఆధారాలతో సహా వివరణ ఇచ్చాడు. నెలకు కేవలం యూట్యూబ్ ద్వారా రూ. 39 లక్షల ఆదాయం వచ్చిందని చూపించాడు. కాబట్టి డబ్బులు తీసుకుని ఫేక్ రివ్యూలు చెప్పే అవసరం నాకు లేదని కౌంటర్ ఇచ్చాడు. ఆదిరెడ్డి సొంత ఊరిలో భారీ హౌస్ నిర్మిస్తున్నాడు. విజయవాడలో ఒక సెలూన్ నడుపుతున్నాడు. అదే సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తూ ఉంటాడు.
అయితే ఆదిరెడ్డిని సహాయం కోరే వారి సంఖ్య ఎక్కువైపోయిందట. తన ఇంటికి, సెలూన్ కి వచ్చి ఆదిరెడ్డి ఉన్నాడా? మాకు సహాయం కావాలని అడుగుతున్నారట. ఈ క్రమంలో ఆదిరెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. నేను చేయగలిగినంత సహాయం చేయగలను. యూఎస్, యూకే వెళ్ళాలి, సాయం చేయమంటే నేను ఏం చేయగలను?. నేను ఒక వ్యవస్థను కాను, ఓ ఏరియా పెద్దమనిషిని కూడా కాను.
అయ్యో ఆకలి అంటే ఎంతమందికి అయినా భోజనం పెట్టిస్తా. పెద్ద పెద్ద కోరికలు అడిగితే తీర్చే అంత సంపాదన, టైం నా దగ్గరలేదు. అందుకే దయచేసి అందరికీ చెబుతున్నా.. దయచేసి ఇంటి కానీ, సెలూన్ కి కానీ రావొద్దు... అని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆదిరెడ్డి వీడియో వైరల్ అవుతుంది. యూట్యూబర్ గా పాప్యులర్ కాకముందు ఆదిరెడ్డి ఆర్థిక కష్టాలు అనుభవించాడు. ఆ బాధలు భరించలేక వాళ్ళ అమ్మగారు ఆత్మహత్య చేసుకున్నారు.