కరోనా ప్రభావిత నగరాలలో ఒకటిగా హైదరాబాద్ ఉంది. దీనితో అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడం జరిగింది. రాజమౌళి కుటుంబానికి కరోనా సోకగా రెండు వారాల ట్రీట్మెంట్ తరువాత కోలుకున్నారు. కాగా హీరో రాజశేఖర్ కుటుంబానికి కూడా కరోనా సోకడం జరిగింది. రాజశేఖర్  ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

ఐతే నేటి ఉదయం రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక నాన్న 'కరోనాతో పోరాడుతున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేయండి'  అని ట్వీట్ చేసింది. దానితో ఒక్కసారిగా రాజశేఖర్ ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. తన ట్వీట్ అర్థం నాన్న పరిస్థితి విషమంగా ఉందని కాదని, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయవద్దని శివాత్మిక మరో ట్వీట్ వేశారు. 

ఈ నేపథ్యంలో రాజశేఖర్ చికిత్స తీసుకుంటున్న సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ వర్గాలు అధికారిక బులెటిన్ విడుదల చేశాయి. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన రాజశేఖర్ కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు, ఆయన చికిత్సకు స్పందిస్తునట్లు వెల్లడించారు. దీనితో రాజశేఖర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక తన తండ్రి రాజశేఖర్ కోసం ప్రార్ధనలు చేయాలన్న శివాత్మిక ట్వీట్ కి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన మిత్రుడు, సహ నటుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఆయన ఆరోగ్యం కోసం ఆయన ప్రార్ధనలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక రాజశేఖర్ తో పాటు శివాత్మిక, జీవిత, శివానిలు కూడా కరోనా బారినపడ్డారు.