బాలీవుడ్‌ నటి దివ్య భట్నాగర్‌కి కరోనా సోకింది. ఆమె గత ఆరు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటం, నీరసంగా ఉండటంతో కోవిడ్‌ టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు దివ్య కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్య తల్లి ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ముంబయిలోని ఎస్‌ఆర్‌వీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు.

ఆమె మాట్లాడుతూ, `దివ్యకి ఆరు రోజుల నుంచి టెంపరేచర్‌ చాలా ఎక్కువగా ఉంది. నీరసంగా, అసౌకర్యవంతంగా ఫీలయ్యింది. ఢిల్లీ నుంచి ఆక్సీమీటర్‌ తీసుకొచ్చి ఆక్సిజన్‌ లెవల్‌ని పరీక్షించారు. అవి 71కి పడిపోయాయి. దీంతో ఆమెని ఆసుపత్రికి తరలించాము. ఇప్పుడు ఆమె ఆక్సిజన్‌ స్థాయి 84 ఉందని, దివ్య ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని, తాజాగా అందిన నివేదికల ప్రకారం ఆమెకి కరోనా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించింది. వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నట్టు తెలిపింది.

డైలీ సీరియల్‌ `యే రష్టా క్యా కెహ్లతా హై`తో నటిగా పాపులర్‌ అయిన దివ్య భట్నాగర్‌ని ఆ మధ్యనే తన భర్త వదిలేశాడు. ఆమెని మోసం చేసి వెళ్లిపోయాడని దివ్య తల్లి పేర్కొంది. `దివ్యని ఆమె భర్త కూడా మోసం చేశాడు. ఆమెని వదిలేశాడు. మాకు తెలియకుండానే ఆమె వివాహం చేసుకుంది. వివాహం తర్వాత దివ్య ఓషివారాలోని ఓ చిన్న ప్రదేశంలో నివసిస్తున్నట్టు తెలిసి నేను చాలా బాధపడ్డాను. అంతకు ముందు మీరా రోడ్డు వద్ద పెద్ద ఇంట్లో ఉండేది. లగ్జరీ జీవితాన్ని అనుభవించింది. కానీ ప్రేమ పెళ్ళితో చాలా ఇబ్బందులు పడింది` అని పేర్కొంది.