`బిగ్‌బాస్‌4` నాల్గో రోజు ఆట రసవత్తరంగా సాగింది. మూడు రోజులపాటు మూసగా, ఎలాంటి సందడి లేకుండా సాగిన నేపథ్యంలో కంటెస్టెంట్లకి గురువారం ఫిజికల్‌ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీంతో ఎవరికి వారు ఆటలు, తమ ప్రతిభతో సందడి చేశారు. షోకి ఊపు తీసుకొచ్చాడు. 

అందులో భాగంగా ఇన్ని రోజులు కాస్త సైలెంట్‌గా ఉన్న దివి వాద్యకి స్పెషల్‌ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇతర కంటెస్టెంట్‌లోని లోపాలను, వారి గురించి తాను ఏమనుకుంటుందో చెప్పమని ఆదేశించాడు. దీంతో అందరి గుట్టు బయటపెట్టింది దివి. మొదట అఖిల్‌ గురించి చెబుతూ, ఆయన మోడల్‌ అని, వాకింగ్‌ స్టయిల్‌ మోడల్‌గానే ఉంటుందని చెప్పింది. గంగవ్వని ఊరికే ఏడవొద్దని చెప్పింది. ఈ సందర్భంగా గంగవ్వకి, సభ్యులకు మధ్య చోటు చేసుకున్న సన్నివేశం ఆకట్టుకుంది.

నటుడు అభిజిత్‌కి కోపం ఎక్కువని, దాన్ని తగ్గించుకోవాలని తెలిపింది. లాస్య చాలా సెన్సిటివ్‌ అట. కానీ తాను అలాంటిదాన్ని  కాదని లాస్య చెప్పడం విశేషం. హారికని మర్యాద నేర్చుకోమని చెప్పింది. పిలిచేటప్పుడు రెస్పెక్ట్ పాటించాలని పరోక్షంగా ఓ వార్నింగే ఇచ్చిందని చెప్పొచ్చు. మోనాల్‌ ఏడుపుగొండు అట. ప్రతి దానికి ఏడవొద్దని చెప్పింది. దేవి నాగవల్లి అతి హైపర్‌ని, డల్‌నెస్‌ రెండూ మంచిది కాదని, ఎప్పుడూ ఒకేలా ఉండమని సూచించింది. 

నోయల్‌ ప్రతిదీ ప్లాన్‌ చేసుకుని మాట్లాడతాడని, క‌ల్యాణి కొన్నిట్లో ఓవ‌ర్ యాక్షన్‌ చేస్తుందని, అది తగ్గించుకోవాలని హెచ్చరించింది. సూర్య కిరణ్‌ అన్నింటిలో పర్‌ఫెక్ట్ గా చెబుతాడని, కానీ నా మాటే వినాలనే మనస్థత్వాన్ని తగ్గించుకోవాలని తెలిపింది. అమ్మ రాజశేఖ‌ర్‌ అందరికి ఇష్టమైన వ్యక్తి అని, కానీ కుళ్లు జోకులు ఆపాలని తెలిపింది. ఇలా అందరి గాలి తీసి హైలైట్‌ అయింది దివి. నాలుగో రోజు గేమ్‌ తర్వాత ఇదే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.