కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన్మథుడు 2 ఆగష్టు 9న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైభవంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. మన్మథుడు సినిమా పేరు చెప్పగానే నాగార్జున, దర్శకుడు విజయ్ భాస్కర్, దేవిశ్రీ సంగీతంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందరికి గుర్తుకొస్తాయి. 

ఈ ఈవెంట్ కు అతిథులుగా విజయ్ భాస్కర్, దేవిశ్రీని నాగ్ ఇన్వైట్ చేశాడు. త్రివిక్రమ్ ఈ ఈవెంట్ లో కనిపించలేదు. కనీసం త్రివిక్రమ్ ప్రస్తావన కూడా నాగార్జున తీసుకురాలేదు. నాగ్ కావాలనే త్రివిక్రమ్ ని సైడ్ చేసినట్లు ఆయన ప్రసంగం ద్వారా అర్థం అవుతోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

మన్మథుడు సృష్టికర్త విజయ భాస్కర్ అని నాగార్జున అన్నారు. అంతవరకు ఒకే. కానీ ఈ చిత్రంలో పంచ్ డైలాగ్స్ కూడా విజయ్ భాస్కర్ మహిమే అని నాగార్జున చేసిన వ్యాఖ్యలు వివాదానికి తావిస్తున్నాయి. మన్మథుడు చిత్రంలో డైలాగ్స్ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ దే. 

నాగార్జున త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకురాకున్నా.. విజయ్ భాస్కర్ మాత్రం 'మై ఫ్రెండ్ త్రివిక్రమ్' అని వేదికపై సంభోదించాడు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అద్భుతమైన డైలాగ్స్, దేవిశ్రీ సూపర్ హిట్ ఆల్బమ్ అందించారని విజయ్ భాస్కర్ గుర్తు చేసుకున్నారు.