కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు ఇటీవల దర్శకుడు చింబుదేవన్, శంకర్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింబుదేవన్ కి డైరెక్షన్ రాదని, శంకర్ ఓ గ్రాఫిక్స్ డైరెక్టర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

వడివేలు ప్రధాన పాత్రలో చింబుదేవన్ మొదలుపెట్టిన 'ఇంసై అరసన్‌ 24 ఏఎం పులికేసి' సినిమా భిన్నాభిప్రాయాల కారణంగా  షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు తనకు స్వేచ్చనివ్వలేదని.. అందుకే గొడవ జరిగిందని వడివేలు విమర్శించారు.

దీంతో కోలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖులు వడివేలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వడివేలు వ్యాఖ్యలనుదర్శకుడు నవీన్, నటుడు సముద్రఖని ఖండించారు. వడివేలు గొప్ప నటుడైనప్పటికీ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేయమని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

కాగా ఇప్పుడు మరో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ వివాదంపై స్పందించారు. వడివేలు తీరుని తప్పుబడుతూ.. దర్శకులను అగౌరవపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. 

సినిమా విజయం సాధిస్తే.. అది మొత్తం యూనిట్ విజయమని చెబుతారని, కానీ ఫ్లాప్ అయితే దర్శకుడి తప్పని అంటారని.. అలాంటిది తనకు పెద్ద హిట్లు ఇచ్చిన దర్శకులపై వడివేలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. దర్శకుడు శంకర్ గురించి అందరికీ తెలుసునని.. చిత్రపరిశ్రమలో ఒకరితో మరొకరు గౌరవంగా ఉండాలని అన్నారు.