2019లో విడుదలైన మహర్షి సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నైజాంలో ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టింది. మొదటిసారి మహేష్ ని డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి ఈ సినిమా  తరువాత ఆయనకు మంచి మిత్రుడు అయ్యారు. మహేష్ ఎక్కడికి వెళ్లినా పక్కన వంశీ కనిపించే వాడు. ఫ్యామిలీతో మహేష్ వెళ్లిన లండన్ టూర్ లో వంశీ తళుక్కున మెరిశారు. సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత మహేష్ మరలా వంశీ పడిపల్లి చిత్రంలో నటించాల్సి ఉంది. త్వరలో వీరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అనుకుంటున్న తరుణంలో, మహేష్ చేయనని చెప్పి వంశీకి షాక్ ఇచ్చాడు. 
 
దానితో వీరి బంధానికి బీటలు వారాయని పుకార్లు రావడం జరిగింది. గతంలో వలె మహేష్, వంశీ పెద్దగా కలిసి కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. కాగా మహేష్ భార్య నమ్రత నేడు సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశారు. తన మిత్రులతో పాటు ఓ హోటల్ లో డిన్నర్ చేస్తున్న ఫోటోను ఆమె షేర్ చేయడం జరిగింది. ఆ ఫొటోలో మహేష్, నమ్రతలతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో వంశీ మహేష్ ని ఒప్పించే పనిలో బిజీగా ఉన్నాడని అనిపిస్తుంది.  మూడు నాలుగేళ్ల వరకు స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. మహేష్ మాత్రమే సర్కారు వారి పాట మూవీ తరువాత మరో చిత్రాన్ని ప్రకటించలేదు. రాజమౌళితో చిత్రం ఉన్నప్పటికీ అది పట్టాలెక్కడానికి చాలా సమయం ఉంది. కాబట్టి వచ్చే ఏడాదైనా మహేష్ తో మూవీ చేయాలనే ప్రయత్నాలలో మహేష్ ఉన్నట్లు అర్థం అవుతుంది. 
 
ఇక వచ్చే నెలలో సర్కారు వారి పాట సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.