టాలీవుడ్ ప్రతిభగల దర్శకులలో తేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో తేజ అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలని తెరక్కించారు. జయం, నువ్వు నేను, చిత్రం లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ తేజ దర్శకత్వంలో తెరకెక్కినవే. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు తేజకు సరైన హిట్ లేదు. దీనితో తేజ టాలీవుడ్ లో నిలదొక్కుకొవడానికి కష్టపడాల్సి వచ్చింది. 

2017లో రానా దగ్గుబాటి హీరోగా నేనే రాజునేనే మంత్రి చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తేజ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ ఏడాది తేజ కాజల్, బెల్లకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సీత మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో తేజ మళ్ళి ఆలోచనలో పడ్డాడు. తన తదుపరి చిత్రంగా ఎలాంటి కథని ఎంపిక చేసుకోవాలనే సందిగ్ధంలో పడ్డాడు. 

తాజా సమాచారం మేరకు తేజ ఓ భారీ ప్రయోగానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. భారత ప్రధాని  సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇండియా, పాక్ మధ్య అత్యంత వివాదంగా మారిన కాశ్మీర్ అంశంలో మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ, కశ్మీర్ ని పూర్తిగా ఇండియాలో అంతర్భాగం చేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశం మొత్తం అభినందనలు వెల్లువెత్తాయి. ఇదే అంశాన్ని కథగా తీసుకుని తేజ సంచలన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించబోతున్నట్లు  వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకువచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రం గురించి నిర్మాతలు అమితాబ్ వద్ద ప్రస్తావించగా.. మంచి ఆలోచన.. పూర్తి కథ సిద్ధం చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మొత్తంగా డైరెక్టర్ తేజ దేశం మొత్తాన్ని ఆకర్షించే ఓ కథతో సిద్ధం అవుతున్నాడు.