దర్శకుడు తేజ తెరకెక్కించిన సీత చిత్రం మే 24న విడుదల కానుంది. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించిన ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. కాజల్ అగర్వాల్ ని తేజ ఈ చిత్రంలో సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. దీనితో ఈ చిత్రంలో ఆసక్తికరమైన కథ ఉందనే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సీత చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. 

దర్శకుడు తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గతంలో కెమెరామెన్ గా పనిచేశానని అన్నారు. ఒకేసారి దర్శకుడిగా, కెమెరామెన్ గా పనిచేయడం కష్టం. అందువల్ల సీత చిత్రంలో సినిమాటోగ్రఫీ భాద్యతలు వేరొకరికి అప్పగించినట్లు తేజ తెలిపారు. చాలా కాలం పాటు నాకు హిట్స్ లేవు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో హిట్ వచ్చింది. ఓ హిట్ సినిమా తీసాను కదా అని దాన్నే గుర్తుపెట్టుకోను. నేను తీసిన ప్లాప్ సినిమాలే ఎక్కువగా గుర్తుంటాయి. అందువల్ల ఒళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేస్తానని తేజ అన్నారు. 

నేనే రాజు నేనే మంత్రి చిత్రం తర్వాత తేజకు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తెరకెక్కించే అవకాశం వచ్చింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తేజ ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడు. సీత చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది.