: సుకుమార్ఆ యన భార్య పేరు తబిత. వీరి వివాహం 2009లో జరిగింది. ఈ జంటకు ఇద్దరు సంతానం. ఆమెకు తన భర్త సినిమాల్లో రెండు రీరిలీజ్ అయితే చూడాలని ఉందిట


ఇప్పుడు అంతటా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. దాదాపు ప్రతీ స్టార్ హీరో సినిమా రీరిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో సుకుమార్ డైరక్ట్ చేసిన చిత్రాలు సైతం రీరిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. అదే సమయంలో సుకుమార్ భార్య తబిత సైతం తన భర్త డైరక్ట్ చేసిన రెండు సినిమాలు రీ రిలీజ్ చేస్తే చూడాలనుకుంటున్నానని ఆ విషయం సుకుమార్ కు చెప్పానని మీడియా తో చెప్పుకొచ్చారు.

తబిత సుకుమార్ మాట్లాడుతూ... " జగడం, 1 నేనొక్కడినే చిత్రాలు రీరిలీజ్ చేయమని నేను సుకుమార్ కు చెప్పాను , అవి రిలీజ్ అయ్యినప్పుడు ఎందుకు వాటికి జనం కనెక్ట్ కాలేదో తెలుసుకోవాలనుకుంటున్నాను..అలాగే ఇప్పుడు కూడా ఏమన్నా మారిందా లేక అలాగే జరుగుతుందా చూడాలని ఉంది " అన్నారామె.

2009లో సుకుమార్‌, తబితను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె సుకృతి, కుమారుడు సుకృత్‌ ఉన్నారు. ప్రస్తుతం తబిత లాండ్రీ కార్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ బిజినెస్‌ రన్‌ చేస్తున్నారు. ఇప్పటికే `లాండ్రీ కార్డ్‌` పేరుతో మూడు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సుకుమార్‌ రైటింగ్స్‌ బాధ్యతల్ని కూడా ఆమె చూసుకుంటున్నారు. 

ఇక సుకుమార్ తాజా చిత్రం పుష్ప-2 ద రూల్ నుంచి నిన్న విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రికార్డుల మోత మోగిస్తోంది. సోషల్ మీడియాలో అత్యధిక లైకులు పొందిన ఫస్ట్ లుక్ గా చరిత్ర సృష్టించింది. అమ్మవారి వేషంలో రౌద్రం ఉట్టిపడేలా కనిపిస్తున్న అల్లు అర్జున్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బన్నీ ఇలాంటి గెటప్ లో కనిపిస్తాడని ఎవరూ ఊహించలేదు. దాంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ లుక్ గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో పుష్ప-2 ప్రకంపనలు సృష్టిస్తోంది. 

బన్నీ ఫస్ట్ లుక్ కు ఇన్ స్టాగ్రామ్ లో 50 లక్షల లైకులు, ఫేస్ బుక్ లో 8.50 లక్షల లైకులు, ట్విట్టర్ లో 2.07 లక్షల లైకులు వచ్చాయి. ఈ మూడు సోషల్ మీడియా వేదికల్లో మరే ఇతర ఫస్ట్ లుక్ కు ఈ స్థాయిలో లైకులు రాలేదని, ఇది ఆల్ టైమ్ రికార్డు అని చిత్ర నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ వెల్లడించింది.