కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు.

సంక్రాంతి పండగ సందర్భంగా తన సొంతూరు ఇరగవరం మండలంలో రేలంగి గ్రామానికి విచ్చేసిన ఆయన తన తదుపరి సినిమా సంగతులతో పాటు మరిన్ని విషయాలను పంచుకున్నారు. సొంతూరులో సంక్రాంతి జరుపుకోవడంఆనందంగా ఉందని చెప్పిన ఆయన ఇప్పటివరకు నాలుగు సినిమాలను డైరెక్ట్ చేసినట్లు.. ప్రస్తుతం గీతాఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు.

దానికి 'కూచిపూడి వారి వీధి' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలిపారు. అలానే కమల్ హాసన్, వెంకటేష్ లతో మల్టీస్టారర్ సినిమా చేసే ఆలోచన ఉందని, దానికి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

అలానే భవిష్యత్తులో సినీ నిర్మాణం చేపట్టే ఆలోచన ఉందని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పిన ఆయన సొంతూరుకి ఏదైనా చేయాలనే తపన ఉందని అన్నారు.