సూపర్ స్టార్ రజినీకాంత్ కి షూటింగ్ సెట్ లో గాయమై రక్తం కారుతున్నా ఆయన షూటింగ్ మాత్రం ఆపలేదనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు దర్శకుడు శంకర్. చెన్నైలోని మహాబలిపురం రోడ్ లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రజినీకాంత్ కి ప్రమాదం జరిగిందట.

'షూటింగ్ జరుగుతున్న సమయంలో రజినీకాంత్ మెట్ల మీద నుండి జారి పడ్డారు. దాంతో ఆయన మోకాలికి తీవ్ర రక్తస్రావమైంది. కానీ దీని గురించి నాకు ఎవరూ చెప్పలేదు. నేను సెట్స్ కి వచ్చిన తరువాత రజినీకాంత్ నా దగ్గరకి వచ్చి అంతా సిద్దమేకదా అని అడిగారు. నేను ఆయనకి సన్నివేశం గురించి వివరించాను. 

ఆ తరువాత ఆయన మేకప్ రూమ్ కి వెళ్లారు. అప్పుడు సెట్స్ లో ఉన్నవారంతా దేని గురించో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రజినీకాంత్ మేనేజర్ నా దగ్గరకి వచ్చి జరిగిన విషయం చెప్పగా.. నేను షాక్ అయ్యాను. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని అనుకున్నాం. కానీ ఆయన షూటింగ్ పూర్తి చేయాలని పట్టుబట్టారు.

అందరం బ్రతిమిలాడితే ఒక షాట్ పూర్తి చేసి హాస్పిటల్ కి వెళ్లారు. ఆయన తగిలింది చిన్న గాయం కాదు.. దాని కారణంగా ఆయన నెలరోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దానికి కూడా రజినీకాంత్ ఒప్పుకోలేదు. షూటింగ్ పూర్తి చేయాలని అన్నారు. పని పట్ల ఆయనకున్న కమిట్మెంట్ చూసి నాకు ఆనందంగా అనిపించింది'' అని వెల్లడించారు.