సున్నితమైన చిత్రాల దర్శకుడిగా శేఖర్ కమ్ముల మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్, యువతలో మంచి క్రేజ్ ఉంది. శేఖర్ కమ్ముల చివరగా ఫిదా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. 

తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రభుత్వం యురేనియం తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. నల్లమలలో యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిర్ణయంపై రాజకీయంగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా శేఖర్ కమ్ముల నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టవద్దని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

'నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే పర్యావరణానికి తీవ్ర నష్టం. ఆ ప్రాంతంలో చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్నారు. పులులకు, ఇతర అటవీ జంతువులకు నల్లమల అడవులు ఆవాసం. యురేనియం తవ్వకాల వల్ల జంతువులు నాశనం అవుతాయి. కృష్ణ నదితో పాటు, దాని ఉపనదులు కాలుష్యంగా మారుతాయి. క్యాన్సర్ రోగాలు పెరుగుతాయి. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు.  ప్రభుత్వం స్పందించి యురేనియం తవ్వకాలపై పునరాలోచించాలని శేఖర్ కమ్ముల కోరారు. 

శేఖర్ కమ్ముల ఈ పోస్ట్ ని టిఆర్ఎస్ నేత, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు కూడా ట్యాగ్ చేశారు.