సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్ గురించి  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీ స్టైల్‌గా నడిచి వస్తే.. రికార్డులు ఆయన వెంటే.  మనదేశంలోనూ కాదు.. విదేశాల్లోనూ ఆయనకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు.. భారత్‌లో అత్యధిక ఆదాయాన్ని అందుకునే స్టార్‌గా రికార్డుల్లోకి ఎక్కినా.. తలైవాగా మన్ననలు అందుకున్నా రజనీ లాగ నిజ జీవితంలో నిరాడంబరంగా జీవించడం మాత్రం అసాధ్యం. అదే రజనీని మరింత మందికి దగ్గర చేసింది. 

అందుకే ఆయనను సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా గుండెల్లో దాచుకున్నారు. నాలుగు దశాబ్ధాల నట జీవితంలో ఎన్నో అవార్డులు.. రివార్డులు ఉన్నాయి..తాజాగా ఆయన నిరాడంబరత గురించిన వార్త ఆయన ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ తో యజమాని చిత్రం డైరక్ట్ చేసిన ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాలు షేర్ చేసారు.

ఆర్‌వీ ఉదయకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ పలువురు నటులు పార్టీలు ప్రారంభిస్తున్నారు. వాళ్లు పార్టీ పెట్టి దేశాన్ని కాపాడే ముందు, వాళ్లను పెంచి పెద్దజేసిన చిత్ర పరిశ్రమను రక్షించాల్సిన ఆవశ్యకత ఉంది. భారీ పారితోషికాలు తీసుకునే నలుగురు పెద్ద హీరోలు చర్చిస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ క్యారవాన్‌ సంస్కృతి ఎప్పుడు మొదలైందో అప్పటినుంచే నిర్మాతకు సమస్యలు మొదలయ్యాయి. రజనీకాంత్‌తో నేను ‘ఎజమాన్‌’ సినిమాను తెరకెక్కించా. అప్పుడు ఆయన షూటింగ్‌ స్పాట్‌లో కొబ్బరిమట్టపైనే నిద్రించేవారు. అంత నిరాడంబరమైన వ్యక్తి రజనీ అని’’ పేర్కొన్నారు. 

వీ సినిమా గ్లోబల్‌ నెట్‌వర్క్స్‌ బ్యానరుపై తెరకెక్కిన చిత్రం ‘ఎవనుం బుద్దనిల్లై’. విజయశేఖరన్‌ దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా సును లక్ష్మి నటించారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలోని కమలా థియేటర్‌లో జరిగింది. దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్‌, సంగీత దర్శకుడు మరియా మనోహర్‌, నిర్మాత కె.రాజన్‌, నటుడు ఆరి, వేల రామమూర్తి, ఆర్‌కే సెల్వమణి, స్నేహన్‌ పాల్గొన్నారు.