తెలంగాణ కవి నామాల రవీంద్రసూరి తండ్రి నామాల చినసాయిలు తుదిశ్వాస విడిచారు. కమ్యూనిస్టుగా ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న సాయిలు చనిపోవడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కవి,రచయిత, ‘చెంబు చినసత్యం’ సినిమా దర్శకులు రవీంద్రసూరి నామాల తండ్రి నామాల చిన సాయిలు (76) బుధవారం (నిన్న) పరమపదించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న సాయిలు బుధవారం సాయంత్రం 7 గంటలకు తన స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. చిన సాయిలు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసిన వీరిది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామం.
నిత్యం ప్రజల మధ్య ఉండే ఒక గొప్ప నిస్వార్థ నాయకుడు చిన సాయిలు. అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలను ఈరోజు ముగించనున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర సూరిని సినీ పరిశ్రమ నుంచి పలువురు పరామర్శించారు. తండ్రి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రవీంద్ర సూరి కూడా తండ్రిలాగే సమాజానికి మేలు జరిగే కార్యక్రమాలో పాల్గొంటున్నారు.
సూర్యాపేటలో డిగ్రీ పూర్తి చేసుకున్న రవీంద్రసూరి.. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (తెలుగు), బీజీజే పట్టాలు పొందాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల శాఖలో ఎంఫిల్ ను కూడా పూర్తి చేశారు. ఈయన ఇప్పటి వరకు 200కు పైగా కవితలు, 25 కథలు రాశారు. టీవీ రంగంలో సీఐడీ విశ్వనాథ్, క్రిమినల్ స్టోరీస్, నువ్వొస్తావని, టేక్ ఇట్ ఈజీ కార్యక్రమాలకు మాటలు, రచయితగా పనిచేశారు.
